అమిత్ షా ఆట‌లు...మా ద‌గ్గ‌ర సాగ‌వు

Update: 2017-09-13 08:21 GMT
ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డేందుకు ఇంకా చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ...పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ వేడి రాజుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గాల్సి ఉండ‌గా అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు - ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో వాతావ‌ర‌ణం వేడేక్కుతోంది. కర్ణాట‌క‌లో అధికార కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమ‌ర్శ‌లు గుప్పించిన నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సైతం ధీటుగానే కౌంట‌ర్ ఇచ్చారు. అమిత్ షా ఆటలు కర్నాటకలో సాగవని తేల్చిచెప్పారు. బళ్ళారి మున్సిపల్ కళాశాల మైదానంలో నిర్వహించిన `అభివృద్ధి-సామాజిక సాధన సమావేశం-2017’` సిద్ధరామయ్య ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భాజపాను లక్ష్యంగా చేసుకుని ఆయన వాగ్బాణాలు సంధించారు. కర్నాటక ప్రజల ఆకాంక్ష మేరకు పలు సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. వీటిని చూసి ఓర్వలేకనే అమిత్‌ షా అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క బళ్లారిలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ. 2955 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని సిద్ధ‌రామ‌య్య అన్నారు.  రానున్న ఎన్నికల్లో విజయం మాదేనని ధీమాతో ప్రకటించారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని సభకు హాజరైన వారిని కోరారు.  ‘మేం 2013 విధానసభ ఎన్నికల సందర్భంగా 165 వాగ్దానాలు ఇచ్చాం. ఇప్పటికే 155 పూర్తి చేశాం. చెప్పిన మాట ప్రకారంగానే కాంగ్రెస్‌ పార్టీ నడుచుకుంటుంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎస్సీ - ఎస్టీలకు కేంద్రం రూ.58 వేల కోట్ల ఖర్చు చేస్తుండగా కేవలం కర్నాటక రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.27,703 వేల కోట్లు ఖర్చు చేస్తోంది` అని అన్నారు. కర్నాటక అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వ రూ. 300 కోట్లు ఖర్చు చేయగా తమ ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయించిందన్నారు.

ప్రతి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు ఎన్నికల వాగ్దానాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నామ‌ని సీఎం సిద్ధ‌రామ‌య్య‌ తెలిపారు. మాకు జాతి - కుల - వర్గ భేదం లేదు. సామాజిక న్యాయం కోసం పేదలు - రైతులు - మహిళలు - కార్మికులు - వెనుకబడిన - అల్పసంఖ్యాకుల వర్గాల ప్రజలకు ప్రాధాన్యమిస్తున్నాం’ అని వివరించారు.
Tags:    

Similar News