యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అదేనా?

Update: 2020-10-05 02:30 GMT
ఉత్తరప్రదేశ్ లో మళ్లీ కుల రాజకీయాలు చిచ్చు రేపుతున్నారు. దేశవ్యాప్తంగా హత్రాస్ దళిత బాలిక హత్య, అత్యాచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. యూపీలో దళిత బాలికపై అత్యాచారం చేసిన నలుగురు నిందితులు ఠాకూర్ అనే అగ్ర కుటుంబానికి చెందిన వారు కావడం.. యూపీ ప్రభుత్వంలో ఠాకూర్ వర్గానికి మంచి పలుకుబడి ఉండడం.. సాక్షాత్తూ సీఎం యోగి ఠాకూర్ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో హత్రాస్ బాలిక కు న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు దేశవ్యాప్తంగా నెలకొంది.

అగ్రవర్ణానికి చెందిన యోగి ఆధిత్యనాథ్ ఠాకూర్ నుంచి యోగిలా ఎలా మారాడాన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.. యోగి ఎవరు? ఆయన చరిత్ర ఏమిటన్నది ఇప్పుడు తెలుసుకొని అక్కడ కుల రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. యోగి అసలు పేరు అజయ్ మోహన్ బిస్త్. 21 ఏళ్లకే డిగ్రీ మ్యాథ్స్ చేశాడు.

యోగి ఆదిత్యనాథ్ కు యూపీ పగ్గాలు అప్పగించడం దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేపింది.. గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. అక్కడే హిందువుల ఎజెండాకు ప్రతినిధిగా ఉన్నారు. ‘హిందూ యువ వాహిని’ని స్థాపించి హిందుత్వ ప్రచారం చేస్తున్నారు. గోరఖ్ పూర్ పట్టణంలో 52 ఎకరాల సువిశాల ప్రాంగణంలో గోరఖ్ నాథ్ మఠం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. 1998లో తొలిసారిగా 26ఏళ్ల వయసులో గోరఖ్ పూర్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేసి లోక్ సభలో అడుగుపెట్టారు. ఇప్పటికి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిపొందుతూ వచ్చారు. హిందువులపై ఎక్కడ చిన్నదాడి జరిగినా ఆయన అక్కడ అనుచరులతో వాలి న్యాయం కోసం పోరాడుతారు. 2007లో మత ఘర్షణల్లో అరెస్ట్ అయ్యి 15రోజులు జైల్లో ఉన్నారు.

బీజేపీ కన్నా ఎక్కువగా ఆర్ఎస్ఎస్ శ్రమించి యూపీలో విజయం సాధించింది. అందుకే ఇప్పుడు తమకు అనుకూలురైన వారిని సీఎం చేయాలని మోడీ, అమిత్ షాలపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అందుకే మఠాధిపతి, హిందుత్వవాది అయిన యోగి ఆదిత్యనాథ్ ను సీఎం చేయాలని మోడీ-షాలపై ఒత్తిడి తీవ్రతరం చేసింది. దీంతో మోడీ ఒప్పుకోక తప్పలేదు. కానీ మోడీ నిజానికి అన్నివర్గాలకు ఆమోదయోగ్యుడైన వారిని సీఎం చేయాలని నిర్ణయించినా చివరకు ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి తలొగ్గాడనే ప్రచారం యూపీలో ఉంది. తదుపరి ప్రధాని అభ్యర్థిగా యోగిని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు ప్రచారం సాగింది.

యూపీలో గట్టి పట్టున్న, అగ్రకులం అయిన ఠాకూర్ వర్గానికి చెందిన ఆదిత్యనాత్ ను సీఎం చేశారు. ఆ తర్వాత బీజేపీకి ఎక్కువగా ఓట్లు వేసిన ఓబీసీ, బ్రాహ్మణ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ఆ వర్గాలకు చెందిన బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలకు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టింది. యూపీలో అధికారంలోకి రావడానికి ఈ మూడు వర్గాలే బీజేపీకి సపోర్టు చేశాయి.

ఇప్పుడు అదే బలమైన ఠాకూర్ వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు దళిత బాలికపై రేప్ చేయడంతో ఈ కేసు నీరుగారిపోతుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సీఎం యోగి ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించారు.


Tags:    

Similar News