మావ‌ద్ద‌ వ్యాక్సిన్ లేదుః ప్రధానికి సీఎం లేఖ‌.. లాక్ డౌన్ పై సీరియ‌స్‌ చ‌ర్చ‌!

Update: 2021-04-17 03:37 GMT
ఏపీలో క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 5 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఇటు చూస్తే వ్యాక్సిన్ కొర‌త‌. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి లేఖ రాసిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రానికి అత్య‌వ‌స‌రంగా వ్యాక్సిన్ పంపించాల‌ని ఆ లేఖ‌లో కోరిన‌ట్టు తెలుస్తోంది.

వ్యాక్సినేష‌న్లో అన్ని రాష్ట్రాల క‌న్నా.. ఏపీ ముందు వ‌ర‌స‌లో ఉంద‌ని కూడా ప్ర‌ధానికి వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ నిబంధ‌న‌ల ప్ర‌కారం అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చామ‌ని, రాబోయే మూడు వారాల్లో 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని పేర్కొన్న‌ట్టు తెలిసింది. గ్రామ, వార్డు వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా విజ‌య‌వంతంగా టీకా కార్య‌క్ర‌మం కొన‌సాగిస్తున్నామ‌ని.. వెంట‌నే 60 ల‌క్ష‌ల డోసులు రాష్ట్రానికి పంపించాల‌ని ప్ర‌ధానిని కోరిన‌ట్టు స‌మాచారం.

ఇక‌, రాష్ట్రంలో లాక్ డౌన్ గురించీ అధికారుల‌తో సీఎం చ‌ర్చించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కొవిడ్ తీవ్ర‌ను అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోక‌న్నా.. గ్రామాల్లోనే మ‌ర‌ణాలు అధికంగా ఉన్నాయ‌ని తేలిన‌ట్టు స‌మాచారం. వైర‌స్ సోకిన త‌ర్వాత ఆల‌స్యంగా ఆసుప‌త్రుల‌ను ఆశ్ర‌యిస్తుండ‌డ‌మే దీనికి కార‌ణంగా భావిస్తున్నారు అధికారులు.ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 7,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్టు స‌మాచారం.

ఈ స‌మీక్ష‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల్లో మ‌రింత‌గా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా.. కొవిడ్ టెస్టు అంద‌రికీ అందుబాటులో ఉంచాల‌ని, ల‌క్ష‌ణాలు క‌నిపించిన వారంద‌రికీ ప‌రీక్ష‌లు చేయాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. ఇక‌, రాష్ట్రంలో లాక్ డౌన్ యోచ‌న ఇప్పుడే లేద‌ని, లాక్ డౌన్ విధించ‌కుండానే.. కొవిడ్ ను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించిన‌ట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News