కాఫీ డే ఆస్తులు అమ్మకానికి.. భారీ స్థాయిలో!

Update: 2019-08-10 01:30 GMT
ఇటీవలే కాఫీ డే చైర్మన్ సిద్ధార్థ ఆత్మహత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బడా పారిశ్రామిక వేత్త అయిన సిద్ధార్థ ఆర్థిక వ్యవహారాలను సరి చేయలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటక మాజీ  సీఎం ఎస్ ఎం కృష్ణ అల్లుడు కావడంతో ఆయన ఆత్మహత్య మరింత సంచలనంగా నిలిచింది.

తను అసహాయుడిని అయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టుగా సిద్ధార్థ్ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. సిద్ధార్థ ఆత్మహత్య నేపథ్యంలో కాఫీ డే కు కొత్త బోర్డు ఏర్పడింది. ఆ బోర్డు ఆధ్వర్యంలో కాఫీ డే లు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి.

సిద్ధార్థ ఆత్మహత్య కు కారణం కాఫీ డేకు భారీ స్థాయిలో అప్పులు ఉండటమే అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అప్పులను తీర్చడానికి కొత్త బోర్డు సమాయత్తం అవుతూ ఉంది.

అందు కోసం భారీ స్థాయిలో బెంగళూరులోని ఆస్తులను అమ్మకానికి ఉంచినట్టుగా తెలుస్తోంది. తొంభై ఎకరాల్లో విస్తరించి ఉన్న గ్లోబల్ విలేజ్ టెక్నాలజీ పార్క్ ను అమ్మనున్నారట. దీని విలువ దాదాపు అరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. ఈ ఆస్తులు అమ్మి కాఫీ డే కు ఉన్న అప్పులను తీర్చబోతోందట కొత్త బోర్డు. అయితే  ఈ చెల్లింపులతో కూడా అప్పులు పూర్తిగా తీరవని తెలుస్తోంది. కొంతమేర మాత్రమే తీరబోతున్నాయని బోర్డే ప్రకటిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News