తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు..?

Update: 2020-04-20 16:12 GMT
కరోనా కలకలం వేళ... తెలుగు నేల విభజనతో పలు కష్టాలను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీపి కబురు చెప్పింది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత... నవ్యాంద్ర నిధుల లేమితో సతమతమవుతోన్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణకు ఆదిలో ఆర్థిక సమస్యలు అంతగా లేకున్నా... మానవ వనరుల లేమితో ఇబ్బంది పడేది. కాలం గిర్రున ఆరేళ్లు తిరిగిన నేపథ్యంలో ఇప్పుడు రెండు రాష్ట్రాలు నిధుల లేమితో పాటు మానవ వనరుల లేమితోనూ ఇబ్బంది పడుతున్నాయి. ప్రత్యేకించి నానాటికీ పేరుకుపోతున్న కేసుల సంఖ్యను త్వరితగతిన తేల్చేందుకు సరిపడా న్యాయమూర్తులు కూడా ఇరు రాష్ట్రాలకు లేరనే చెప్పాలి. అందుబాటులో ఉన్న అరకొర సంఖ్యలో న్యాయమూర్తులతోనే రెండు రాష్ట్రాల హైకోర్టులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ సమస్యను తీర్చే దిశగా ఇప్పుడు కేంద్రం రెండు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పింది.

రెండు రాష్ట్రాల హైకోర్టులకు కొత్తగా న్యాయమూర్తులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం.. ఇరు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేసిన కొలీజియం... తెలంగాణ హైకోర్టుకు మాత్రం ఒక్కరినే సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టుకు కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల్లో బి.కృష్ణమోహన్‌ - కె.సురేశ్‌రెడ్డి - కె.లలితకుమారి ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ హైకోర్టుకు బి.విజయ్‌ సేన్‌ రెడ్డిని సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు అంటే... దాదాపుగా సదరు న్యాయమూర్తుల నియామకాలు ఖరారైనట్లే లెక్క. అంటే... ఏపీ హైకోర్టుకు ముగ్గురు - తెలంగాణ హైకోర్టుకు ఒకరు కొత్త న్యాయమూర్తులు త్వరలోనే అందుబాటులోకి వచ్చేసినట్టేనన్న మాట.
Tags:    

Similar News