బాబు క‌సిగా ప‌ని చేస్తే ఇలా ఉంటుంది!!

Update: 2017-06-07 07:17 GMT
అవే మాట‌లు. అదే ఆవేశం. ఏ మాత్రం మార్పు లేకుండా చెప్పిందే చెబుతూ.. ఏళ్ల‌కు ఏళ్లు బండి లాగించేస్తుంటారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. త‌న‌ను తాను గొప్ప‌గా చెప్పుకుంటూ.. త‌న‌లోని క‌మిట్ మెంట్ గురించి భారీ మాట‌లు చెప్పుకోవ‌టం ఆయ‌న‌కు అల‌వాటే. అయితే.. ఆయ‌న మాట‌ల‌కు చేత‌ల‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని ఎవ‌రైనా విమ‌ర్శిస్తే.. ఏపీ అభివృద్ధిని దెబ్బ తీసే మాట‌లు మాట్లాడుతున్నారంటూ మండిప‌డే వారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ బాబు పాల‌న మీద విమ‌ర్శ‌లు చేసే వారి మాట‌లు నిజ‌మ‌న్న విష‌యాన్ని ఓ చిన్న వ‌ర్షం తేల్చేసింది.

తాజాగా అమ‌రావ‌తిలో కురిసిన తాజా వ‌ర్షంతో ఏపీ స‌చివాల‌యం.. అసెంబ్లీ భ‌వ‌నాలు చిగురుటాకులా వ‌ణికిపోయాయి. ఈ సీన్‌ కు కొద్ది గంట‌ల ముందుగా త‌న న‌వ‌నిర్మాణ దీక్ష సంద‌ర్భంగా ప్ర‌సంగించారు చంద్ర‌బాబు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట‌ల్ని వింటే.. ఆయ‌న మాట‌ల‌కు వ‌ర్ష‌పు సీన్‌ కు ఏ మాత్రం సింక్ కాద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ.. న‌వ‌నిర్మాణ దీక్ష సంద‌ర్భంగా ఆయ‌నేమ‌న్నారు? ఆ త‌ర్వాత కురిసిన వ‌ర్షం నేప‌థ్యంలో లీకుల స‌చివాల‌యాన్ని చూసిన నేప‌థ్యంలో సామాన్యుడి మ‌దిలో మెదిలే సందేహాల్ని క‌లిపి ఎలా ఉంటుందో చూస్తే..

బాబు మాట‌

విభ‌జ‌న బిల్లును యుద్ధ విమానంలో పంపారు. ఏపీ కాంగ్రెస్ నేత‌ల్ని అధిష్ఠానం వార్ రూంలో పెట్టి ఒప్పుకుంటారా? చ‌స్తారా? అంటూ రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఆ రోజు గ‌ట్టిగా అడిగి ఉంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాదు. పార్ల‌మెంటులో 20 నిమిషాల్లో బిల్లు ఆమోదింప‌చేశారు. మ‌న ఎంపీల్ని కొట్టారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా విభ‌జించింది. రాష్ట్రం ప‌ట్ల ఘోరంగా వ్య‌వ‌హ‌రించింది.

సామాన్యుడి సందేహాలు

జ‌రిగిన చ‌రిత్ర‌లో అన్ని నిజాలే. వ‌ర్త‌మానానికి వ‌ద్దాం. ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ ఇచ్చిన హోదా హామీని  ఎవ‌రికి చెప్పి.. ఎవ‌రి ఆమోదంతో ప్యాకేజీగా మార్చారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఎవ‌రితోనూ సంప్ర‌దింపులు జ‌ర‌ప‌లేద‌న్న విమ‌ర్శ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం జ‌రిగిందేమిటి? ఢిల్లీలో కూర్చున్న మోడీ.. హోదాకు నో.. ప్యాకేజీకి ఎస్ అంటే.. హైద‌రాబాద్ లో ఉన్న మీరు ఓకే అనాల్సి వ‌చ్చిందిగా? మ‌రి.. దీన్నేమంటారు? హోదా ప‌దేళ్లు ఇస్తామ‌న్న వారు.. ప్యాకేజీతో స‌రిపెట్ట‌టాన్ని మీరు ఎందుకు వ్య‌తిరేకించ‌లేదు. అధికారానికి వ‌చ్చిన మొద‌ట్లో హోదా ఏపీకి ప్రాణ‌వాయువు అన్న మీరు.. త‌ర్వాతి కాలంలో ప్యాకేజీకి ఎలా ఓకే అనేస్తున్నారు?

బాబు మాట‌

పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్ర నిధులు ఎందుకు తీసుకోవ‌టం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్రమే నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ణాళిక సంఘం సూచించింది. విభ‌జ‌న అనంత‌రం భ‌య‌ప‌డి డీలా ప‌డితే జాతి న‌ష్ట‌పోతుంద‌ని.. ఆ రోజు నంబ‌రు వ‌న్ రాష్ట్రంగా చేస్తాన‌ని హామీ ఇచ్చాను.

సామాన్యుడి సందేహాలు

ఎవ‌రేం చెబితే అది చేసేయ‌ట‌మేనా?విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్ర‌మే పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేస్తామ‌ని చెప్పింది క‌దా? ఉన్న‌ట్లుండి ఈ మార్పు ఏంది? ప‌్లానింగ్ క‌మిష‌న్ చెబితే.. వారిని ప్ర‌శ్నించాలి క‌దా? అలా ఎందుకు చేయ‌లేదు?

విభ‌జ‌న అనంత‌రం భ‌య‌ప‌డి డీలా ప‌డితే జాతి న‌ష్ట‌పోతుంద‌ని.. ఆ రోజు నంబ‌రు వ‌న్ రాష్ట్రంగా చేస్తాన‌ని హామీ ఇచ్చాన‌ని చెబుతున్నారు. హామీతోనే అన్ని అయిపోవు క‌దా? అయినా విభ‌జ‌న‌తో ఆంధ్రోళ్లు భ‌య‌ప‌డ‌లేదు. భ‌య‌ప‌డ్డార‌ని మీరెలా అనుకుంటున్నారు? అది బాధ‌. ప్ర‌జ‌ల బాధ మీకు భ‌యంగా క‌నిపించ‌టం ఏమిటి? అది గొప్ప‌గా అంద‌రి ముందు ప‌దే ప‌దే మాట్లాడ‌టం ఏంటి? న‌ంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా చేస్తాన‌ని హామీ ఇచ్చాన‌ని గొప్ప‌గా చెబుతున్నారు. మీరు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అయ్యింది. అన్ని కాదు.. ఒక్క విష‌యంలో అయినా తిరుగులేని ప్ర‌గ‌తి సాధించామ‌న్న మాట ఒక్క‌టి చూపించ‌గ‌ల‌రా? అన్ని వ‌దిలేసి.. కొత్త‌గా క‌ట్టిన స‌చివాల‌య భ‌వ‌నం.. అసెంబ్లీ భ‌వ‌నం కూడా ఎన్ని లీకులో ఇవాళే జ‌నాల‌కు అర్థ‌మైంది? ఇలాంటి వాటితోనే దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా ఏపీని చేస్తారా?

బాబు మాట‌

రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌నే బాధ‌ను క‌సిగా మార్చుకొని మ‌న‌కు అన్యాయం చేసిన వారు ఆసూయ‌ప‌డేలా అభివృద్ధి చేసుకుందాం. అంద‌రికి అనుకూలంగా ఉండే ప్రాంత‌మ‌ని భావించి అమ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్ణ‌యించాం.

సామాన్యుడి సందేహాలు

బాధ‌ను క‌సిగా మార్చుకునే వ‌ర‌కూ ఓకే. మీరు ఇప్ప‌టికే బాధ‌ను క‌సిగా మార్చుకున్నార‌నే అనుకున్నాం. అలాంటి స్థితిలో ఉన్న మీరు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన స‌చివాల‌యం.. అసెంబ్లీ భ‌వ‌నాలు.. 20 నిమిషాల వ‌ర్షానికి ఎలా మారాయో చూశాం. మీ క‌సి ఏ రేంజ్లో ఉందో.. ఓ మోస్త‌రు వ‌ర్షానికే కొత్త బిల్డింగ్‌ లో కారుతున్న వాన నీటిని బ‌క్కెట్ల‌లో పట్టుకున్న వైనం చూసిన‌ప్పుడు.. ఈ విష‌యాలు మ‌న‌కు అన్యాయం చేసే వారు వింటే ఎలా ఫీల్ అయి ఉంటార‌న్న విష‌యం ఆలోచిస్తేనే సిగ్గేస్తోంది. మ‌న రాజ‌ధానిని చూసి ఆసూయ ప‌డ‌టం త‌ర్వాత‌..  లీకులు లేకుండా బిల్డింగులు కూడా క‌ట్టుకోలేరా? అన్న ప్ర‌శ్న వారి నోటి నుంచి వ‌స్తే సిగ్గుతో త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలంటారు? ఇదేనా బాధ‌ను క‌సిగా మార్చుకోవ‌టం?

బాబు మాట

రాజ‌ధానిని నిర్మించే అవ‌కాశం భ‌గ‌వంతుడు నాకు క‌ల్పించాడు

సామాన్యుడి సందేహం

మీరు ఇదే మాట గ‌డిచిన మూడేళ్ల‌లో కొన్ని వేల సార్లు చెప్పి ఉంటారు. నిజ‌మేన‌ని మేమూ ఫీల‌య్యాం. కానీ.. ఇప్పుడే భ‌య‌ప‌డుతున్నాం. ఎందుకంటే.. చిన్న వ‌ర్షానికే క‌ట్టిన రెండు ముఖ్య‌మైన భ‌వ‌నాల ప‌రిస్థితి ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో నిర్మించే నిర్మాణాల ప‌రిస్థితి ఏమిటి? అన్న సందేహం వ‌చ్చినంత‌నే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి.. రాజ‌ధానిని నిర్మించే అవ‌కాశం భ‌గ‌వంతుడు క‌ల్పించిన‌ట్లుగా ఫీల్ అయితే.. లీకుల నిర్మాణాల మీద ఏమ‌ని రియాక్ట్ అవుతారు బాబు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News