మన ‘పద్మాలు’ సామాజిక వర్గాల లొల్లి?

Update: 2016-01-27 04:38 GMT
తాజాగా కేంద్రం ప్రకటించిన పద్మాల జాబితాలో..మరి ముఖ్యంగా తెలుగుప్రాంతాలకు సంబంధించినంతవరకూ ఎంపిక చేసిన ప్రముఖులకు సంబంధించి ఆసక్తికర చర్చ ఒకటి సాగుతోంది. ప్రతి విషయంలోనూ కులాల కోణాన్ని చూసే ఏపీ ప్రాంతానికి చెందిన పలువురు.. తాజాగా ఎంపికైన పలువురు ప్రముఖులకు సంబంధించిన కుల కోణాన్ని ఎత్తి చూపించటం చర్చగా మారింది.

పద్మ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం మొదలు కొని పద్మశ్రీగా ఎంపికైన పలువురిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు చాలా ఎక్కువమంది ఉన్నారన్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 112  పద్మపురస్కారాలు లభిస్తే.. ఇందులో తెలుగుప్రాంతాలకు చెందిన వారు మొత్తం 14 మంది ఉన్నారు. ఈ 14 మందిలో ఆరుగురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం విశేషంగా చెబుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆరుగురిలో ఐదుగురు ఏపీ నుంచి ఉండటం విశేషం.

ఇంత భారీగా మరే సామాజిక వర్గానికి ఇంత పెద్ద పీట వేయలేదన్న విమర్శ వినిపిస్తోంది. ఒకేసామాజిక వర్గానికి చెందిన వారిలో పద్మవిభూషణ్ మొదలుకొని.. పద్మభూషణ్.. పద్మశ్రీ పురస్కారాలు లభించటం చర్చగా మారింది. పద్మ పురస్కారంపై సామాజిక వర్గాల చర్చ సరికాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు రెండు జాబితాల్లో మొత్తంగా 56 మంది పేర్లు పంపితే అందులో నుంచి ఒక్క పేరును మాత్రమే తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇవాల్టి రోజున ప్రతి విషయం రాజకీయంగా మారుతున్న సమయంలో.. పద్మ పురస్కారాల ఎంపికలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేయటం రాజకీయ విమర్శలకు తావిచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News