కాంగ్రెస్ ఇక మార‌దు

Update: 2021-12-28 10:30 GMT
అధికారంలోకి వ‌చ్చేందుకు ఏ పార్టీకైనా నాయ‌కులే ప్ర‌ధాన బ‌లం. కానీ కాంగ్రెస్‌లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధ‌మైన ప‌రిస్థితి ఉంది. సొంత నేత‌లే ఆ పార్టీని ముంచుతున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎంతో కాలంగా అటు జాతీయ స్థాయిలో.. ఇటు తెలంగాణ‌లో కాంగ్రెస్‌లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. రోజురోజుకూ ప‌రిస్థితి మెరుగుప‌డ‌క‌పోగా మ‌రింత దిగ‌జారుతోంద‌ని చెప్తున్నారు.

ఆ గుర్తింపు పోగొట్టుకుని..

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మం ఉద్ధృతంగా సాగిన సంగతి తెలిసిందే. ఇక్క‌డి ప్ర‌జల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ‌ను పొందే విష‌యంలో ఆ పార్టీ దారుణంగా విఫ‌ల‌మైంది. ఆ గుర్తింపును ద‌క్కించుకోవ‌డంలో ఫెయిలైంది.

అందుకు ఇక్క‌డి పార్టీ నాయ‌కులే కార‌ణ‌మ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విష‌యాన్ని వాళ్లు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌లేక‌పోయారు. ఎప్పుడూ సొంత ప్ర‌యోజ‌నాల కోస‌మే పాకులాడే ఆ నాయ‌కులు ఇక అలా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ‌తార‌ని ఎలా అనుకుంటామ‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి.

ఇప్పుడు కూడా..

రాష్ట్రంలో వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌కు ఘోర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనైనా మంచి ఫ‌లితాలు సాధించే దిశ‌గా టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం నిర్ణ‌యించింది. ఇది పార్టీలోని చాలా మంది సీనియ‌ర్ నాయ‌కుల‌కు న‌చ్చ‌లేదు. ఓ వైపు టీపీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్పటి నుంచి ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధర్నాలు, స‌భ‌ల పేరుతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న రేవంత్‌.. తిరిగి పార్టీలో జోష్ నింపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కానీ ఆయ‌న‌కు పార్టీలోని సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం లేద‌నే టాక్ ఉంది. రేవంత్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. ఎవ‌రిని సంప్ర‌దించ‌క‌పోవ‌డం అందుకు కార‌ణ‌మ‌న్న‌ది సీనియ‌ర్ల వాద‌న‌. తాజాగా రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి ర‌చ్చబండ కార్య‌క్రమానికి రేవంత్ శ్రీకారం చుట్టారు. సీఎం ద‌త్త‌త గ్రామ‌మైన ఎర్ర‌వ‌ల్లిలో ర‌చ్చ‌బండ వ‌ద్ద స‌మ‌వేశానికి పిలుపునిచ్చారు. కానీ అనుమ‌తి లేద‌ని పోలీసులు దాన్ని అడ్డుకున్నారు.

ఆ ఫిర్యాదు..

రేవంత్‌పై అదే పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఎర్ర‌వ‌ల్లిలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి త‌ల‌పెట్టిన రేవంత్ అదే జిల్లాకు చెందిన త‌న‌కు క‌నీస స‌మాచారం ఇవ్వ‌లేద‌నేది పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడైన జ‌గ్గారెడ్డి ఆవేద‌న‌. దీంతో ఆయ‌న రేవంత్‌పై ఫిర్యాదు చేస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి లేఖ రాశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌ను పెంచుకోవ‌డానికి రేవంత్ ప్రాధాన్య‌తనిస్తున్నార‌ని, అది పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు.

ఆయ‌న వైఖ‌రి మార్చుకోవాల‌ని రేవంత్‌ను ఆదేశించాల‌ని లేదంటే ఆయ‌న స్థానంలో కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించాల‌ని జ‌గ్గారెడ్డి కోరారు. మ‌రోవైపు ఈ అంశంపై రేవంత్ ముందుగానే టీపీసీసీ పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీలో చ‌ర్చిస్తే బాగుండేద‌ని సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు.




Tags:    

Similar News