90 ఏళ్ల వయసులో ఆయన కమిట్మెంట్ కు నెటిజన్లు ఫిదా!
అవేవీ ఆయన నిబద్ధతను నిలువరించలేకపోయాయి! ఫలితంగా.. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోను ఆయన రాజ్యసభకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దేశం గర్వించదగ్గ ఆర్థిక వేత్త, ఆధునిక భారత రూపకర్త, మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా.. మన్మోహన్ సింగ్ కమిట్మెంట్ కు సంబంధించిన ఓ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అవును... దేశంలో ఎంతమంది నేతలు ఉన్నా వారిలో అతి తక్కువ మంది మాత్రమే సంస్కరణలు చేసి, దేశ చరిత్రను మలుపుతిప్పే నిర్ణయాలు తీసుకుంటారని, దేశానికే టార్చ్ బేరర్స్ గా చరిత్ర పుటల్లో నిలుస్తారని అంటారు. అలాంటివారిలో ఒకరు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ సందర్భంగా... ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆయనకున్న నిబద్ధతకు అద్ధం పట్టిన ఒక ఉదాహరణ మరోసారి వైరల్ గా మారింది.
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రమాణ స్వీకారం నాడు చేసిన ప్ర్మాణానికీ కట్టుబడి ఉండటం చాలా అరుదనే కామెంట్లు సమాజంలో వినిపిస్తాయనే సంగతి తెలిసిందే. ఆత్మపరిశీలన ఫలితమో ఏమో కానీ.. వీటిపై రాజకీయ నేతల నుంచి పెద్దగా అభ్యంతరాలు రావని అంటుంటారు.
అయితే.. ఓ బిల్లు నెగ్గితే ఢిల్లీ ప్రభుత్వం అధికారుల అధికారాలపై కత్తెర పడుతుందని.. ఏ విధంగానైనా ఆ బిల్లును ఓడించేందుకు ఓటింగ్ లో పాల్గొనాలని ఆప్ నేతల విజ్ఞప్తి మేరకు తన బాధ్యతను విస్మరించకుండా.. సత్తువ లేకున్నా ఊపిరి ఉన్నంత వరకూ తన ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తించాలని డాక్టర్ మన్మోహన్ భావించారు.
ఇందులో భాగంగా... ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియంత్రణ కోసం మోడీ సర్కార్ తెచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై గత ఏడాది ఆగస్టు 7న రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ వయసు 90 ఏళ్లు. దానికి తోడు వృద్ధాప్య సమస్యల కారణంగా వీల్ చైర్ కి పరిమితమైన పరిస్థితి.
అవేవీ ఆయన నిబద్ధతను నిలువరించలేకపోయాయి! ఫలితంగా.. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోను ఆయన రాజ్యసభకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో.. ఆయన చర్యను కొనియాడుతూ నెటిజన్లు డాక్టర్ మన్మోహన్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. చాలామంది నేతలకు ఆయన స్ఫూర్తి అని కొనియాడారు.
ఈ క్రమంలో ఆయన మరణించిన అనంతరం మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. దీంతో.. మరోసారి ఈ విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది.