రూపాయి విలువ తగ్గించి.. భారత దేశ వాల్యూ పెంచారు
1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది.
రూపాయి విలువ తగ్గించటం ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం ఏమిటి? రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? అని అనుకోవచ్చు. ఆర్థిక అంశాల్ని తప్పుగా అర్థం చేసుకున్నామని అనుకోచ్చు. కానీ.. అదేమీ నిజం కాదు. మీరు చదువుతున్నది అక్షర సత్యం. దేశ ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నవేళ.. ఏం చేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న దానిపై అద్భుత రీతిలో మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయం.. సూపర్ సక్సెస్ కావటమే కాదు.. దేశ ఆర్థిక పతనాన్ని బలంగా అడ్డుకోగలిగారు. అదెలానంటే..
1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది. బొటాబొటిగా ఉన్న మెజార్టీతో కుంటుతూ ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి. ఇలాంటి వేళ ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపడితే.. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయానికి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ అంపశయ్య మీద ఉంది. విదేశీ దిగుమతుల కోసం దేశం వద్ద ఉన్న మారకద్రవ్యం విలువ కేవలం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే.
ఆ నగదు కేవలం రెండు వారాలకు మాత్రమే సరిపోతుంది. ఇలాంటివేళ.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి వీలుగా సాహసోపేతమైన నిర్ణయాల్ని తీసుకున్నారు. కేవలం వంద రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా చేపట్టిన చర్యలు.. చరిత్రలో అలా నిలిచిపోతాయంతే. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే సంచలన నిర్ణయాన్ని తీసుకొన్న మన్మోహన్ కారణంగా.. భారత్ కు జరిగిన మేలు అంతా ఇంతా కాదు.
పీవీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కుదేల్ అయిపోయిందన్న వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఎన్నారైలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవటం మొదలు పెట్టారు. దీన్ని అడ్డుకట్ట వేసేందుకు జులై 1న డాలరుతో రూపాయి మారకం విలువను 9.5 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత రెండోసారి రూపాయి మారకం విలువను 12 శాతానికి తగ్గించారు. అంటే.. రెండు రోజుల వ్యవధిలో రూపాయి మారకం విలువ 20 శాతానికి తగ్గిపోయింది. దీంతో.. వెనక్కి మళ్లుతున్న ఎన్నారైల సంపదకు బ్రేకులు పడ్డాయి. అంతేకాదు.. తమ వద్ద ఉన్న డాలర్లను ఇండియాలోకి పంప్ చేశారు. దీంతో విదేశీ మారకద్రవ్య లోటుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న 20 టన్నుల బంగారాన్ని గ్యారెంటీగా చూపించి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి 600 మిలియన్ డాలర్ల అప్పు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్థిక మంత్రి హోదాలో 1991 జులై 25న ఆర్థిక మంత్రి హోదాలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకుంటే.. అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించటంతో పాటు.. ఎగుమతులపై ఉన్న సబ్సిడీలను ఎత్తి వేయటం.. దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించటం లాంటి నిర్ణయాల్ని ధైర్యంగా తీసుకోవటంతో.. కీలక రంగాల్లో ప్రభుత్వ పెత్తనానికి గుడ్ బై్ చెప్పేశారు. ప్రైవేటుకు రెడ్ కార్పెట్ వేసి.. ప్రత్యక్ష పన్నులు విధానాన్ని సరళీకరిస్తూ నిర్ణయం తీసుకోవటంతో.. బ్లాక్ మనీ చాలావరకు అడ్డుపడింది. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి.. ఈ రోజు ఉన్న పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ దని చెప్పక తప్పదు.