టీటీడీపై హాట్ కామెంట్స్... ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వంతు!
తెలంగాణకు చెందిన భక్తులపై తిరుమలలో వివక్ష చూపుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.
తెలంగాణ విడిపోయిన సమయంలోనే కానీ, గత వైసీపీ ప్రభుత్వంలో కానీ తమకు ఇబ్బందులు లేవని.. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ మంత్రి, బీఆరెస్స్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణకు చెందిన భక్తులపై తిరుమలలో వివక్ష చూపుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీనిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ... తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే... తిరుమలలో టీటీడీ బోర్డు వ్యవహార శైలిపై వ్యాఖ్యానించడం పై చర్యలు తీసుకుంటున్నారా.. లేక, ప్రదేశం ఏదైనా కూడా టీటీడీ వైఖరిపై వ్యాఖ్యానించినా చర్యలు తీసుకుంటారా అనేది క్లారిటీ లేదని అంటున్న వేళ.. తాజాగా కొండా సురేఖ స్పందించారు. ఈ సందర్భంగా టీటీడీపై హాట్ కామెంట్స్ చేశారు.
అవును... తెలంగాణ భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వివక్ష చూపిస్తుందంటు ఇటీవల తీవ్ర చర్చ మొదలైన సంగతి తెలిసిందే. దీనిపై బీఆరెస్స్ నేతల నుంచి విమర్శలు రాగా.. తాజాగా కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ నుంచి అదే తరహా ఆరోపణలతో కూడిన విమర్శలు రావడం గమనార్హం!
శుక్రవారం తెల్లవారుజామున శ్రీశైలం మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. దర్శనానంతరం మాట్లాడుతూ తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సురేఖ... తమకు తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఇబ్బంది ఉందని.. తెలంగాణ నుంచి వచ్చే భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని.. ఆ విషయంలో ఏపీ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నామని.. గతంలో ఎలాంటి పద్దతులు పాటించేవారో అలానే ఉండాలని కోరడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ నుంచి అధిక భక్తులు వస్తారు.. అధిక రాబడి వస్తుందని కొండా సురేఖ తెలిపారు. గతంలో కల్యాణ మండపాలు, కాలనీ గుడులకు సంబంధించి చాలా నిధులు వచ్చేవని.. ఇప్పుడు కూడా ఆ మేరకు నిధులు రావాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో గ్రామ గ్రామాణ కల్యాణ్ మండపాలు అడుగుతున్నారని.. టీటీడీ తలచుకుంటే ఇవన్నీ జరుగుతాయని వెల్లడించారు.
ఇదే సమయంలో... ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. తెలంగాణ ప్రజలకు ఓ నమ్మకం కలిగిస్తారని నమ్ముతున్నట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.