మన్మోహన్ పాలనా మెరుపులు చరిత్రలో నిలిచి పోతాయంతే!

పదేళ్ల మన్మోహన్ పాలనను చూస్తే.. ఆయన సాధించిన ఘనతలు అన్ని ఇన్ని కావు. దేశంలోని 3 కోట్ల మంది చిన్న.. సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సర్కారుకే చెల్లుతుంది.

Update: 2024-12-27 06:07 GMT

మౌన ప్రధానమంత్రిగా ఆయనకు సరైన ఇమేజ్ లేకపోవచ్చు. కానీ.. తనకు దక్కిన అవకాశాన్ని దేశానికి మాత్రమే వెచ్చించారు తప్పించి.. తనకంటూ ఏమీ చేసుకోని తత్త్వం మన్మోహన్ సింగ్ లో కనిపిస్తుంది. సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల మధ్య ఆయన అత్యుత్తమ పాలనను అందించారని చెప్పాలి. టన్నుల కొద్దీ విమర్శల పిడుగులు పడినప్పటికీ.. ఏ ఒక్కటి ఆయన్ను నేరుగా తాకింది కాదు. ఆయన పదేళ్ల పాలనా కాలంలో బోలెడన్ని స్కాంలు బయటకు వచ్చాయి. అయితే.. వేటిలోనూ ఆయన పాత్ర ఉందని కాని.. మరెలాంటి నిందను ఆయన మీద వేసే సాహసం ఎవరూ చేయలేదు. అలాంటి ఘనత మన్మోహన్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.

పదేళ్ల మన్మోహన్ పాలనను చూస్తే.. ఆయన సాధించిన ఘనతలు అన్ని ఇన్ని కావు. దేశంలోని 3 కోట్ల మంది చిన్న.. సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సర్కారుకే చెల్లుతుంది. రుణమాఫీ అంశంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయం యూపీఏ మరోసారి అధికారంలోకి వచ్చేలా చేసిందని చెప్పాలి. ఇదే అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ తర్వాతి కాలంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతేకాదు.. ఆయన పాలనా కాలంలోనే విదర్భ.. బుందేల్ ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు.

మన్మోహన్ పదేళ్ల కాలంలో ఆయన సర్కారు సాధించిన విజయాన్ని చూస్తే..

- దేశానికి 3జీ.. 4జీ సేవల ప్రారంభం

- ఆధార్ కార్డుల జారీ

- గ్రామీణ పేదలకు ఏడాదికి వంద రోజుల పనికి గ్యారెంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకం

- సంక్షేమ పథకాల కింద ఇచ్చే నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్థిదారుల బ్యాంకుల్లోకి నేరుగా బదిలీ చేసే విధానం.

- ప్రైవేటు పాఠశాలల్లో కొందరు పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునేలా నిబంధన.

- సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం.

- భూసేకర చట్టాన్ని ఆధునికీకరించటం.. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం. పునరావాస చర్యల ప్యాకేజీలు

- ఉగ్రవాదాన్ని అణించివేసేందుకు ఏర్పాటు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)

- అమెరికాతో అణు ఒప్పందం

- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర

- తెలంగాణ బిల్లు విజయవంతంగా పూర్తి చేయటం

- ఢిల్లీతో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలు విస్తరణ

- దేశ రాష్ట్రపతి పదవిని ఒక మహిళను ఎంపిక చేసిన ఘనత

- సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్

- జీఎస్టీ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చిన మేధావి

- రూ.72 వేల కోట్లతో 3 కోట్ల మంది చిన్న.. సన్నకారు రైతులకు రుణమాఫీ

ఇన్ని ఘనతలు సాధించిన మన్మోహన్ పదేళ్ల పాలనతో మరకలు ఉన్నాయి. అయితే.. ఆయన కాలంలో వెలుగు చూసిన మరకలు ఏ ఒక్కటి ఆయన్ను అంటుకోలేదు. ఎవరూ అంటించే సాహసం చేయేలేదు. ఆయన ధరించే మల్లెపువ్వులాంటి దుస్తులకు తగ్గట్లే.. ఆయన వ్యక్తిత్వం ఉంటుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మన్మోహన్ పదేళ్ల కాలంలో వెలుగు చూసిన స్కాంలు

- 2జీ స్కాం

- బొగ్గు స్కాం

- కామన్ వెల్త్ స్కాం

- ఆదర్శ్ కుంభకోణం

- 2008లో ముంబయి ఉగ్రదాడి

- 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన

- అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం

Tags:    

Similar News