కాంగ్రెస్ మార్క్ ఫ్యామిలీ ప్లానింగ్ : కుటుంబం నుంచి ఒక్కరికే ...?

Update: 2022-05-13 10:36 GMT
కాంగ్రెస్ పార్టీ వర్తమాన రాజకీయాకు తగినట్లుగా మారుతోంది. తనను తాను మార్చుకుంటోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ చూడాని విధానాలు, నిర్ణయాలు కూడా ఇక మీదట  అమలు కాబోతున్నాయి. నిజానికి వారసత్వ రాజకీయాలు  అంటే కేరాఫ్ కాంగ్రెస్ అంటారు. ఆ పార్టీలో ఒక నాయకుడి ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. టికెట్లు కూడా ఎప్పటికపుడు వారే  దక్కించుకుని దర్జా చేస్తారు.

తాత, కొడుకు,మనవడు ఇలా కాంగ్రెస్ లో పదవులు అనుభవించిన వారి చరిత్ర కూడా ఉంది. అలాంటి కాంగ్రెస్ ఇపుడు కఠినమైన నిర్ణయం తీసుకుంది.  రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఈ రోజు నుంచి మొదలై  మూడు రోజుల పాటు జరగనున్న  చింతన్ శివిర్ కార్యక్రమంలో అధినాయకురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన ఒకటి చేశారు. ఇక మీదట పార్టీ తరఫున ఒక్కరికే టికెట్ ఇస్తామని ఆమె చెప్పడం విశేషం.

అంటే కాంగ్రెస్ లో ఏళ్ళకు ఏళ్ళు,  బడా చోటా ఫ్యామిలీస్ అన్నీ కట్టకట్టుకుని పార్టీని కమ్మేసుకున్న తీరుకు పూర్తిగా చెక్ చెప్పబోతున్నారు అన్న మాట. కాంగ్రెస్ పార్టీలో నిజానికి అధినాయకత్వం నుంచే ఈ రకమైన ధోరణి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా గత ఎన్నికల దాకా పోటీ చేశారు. ఇపుడు వన్ ఫ్యామిలీ వన్ టికెట్ అంటూ కాంగ్రెస్ పెట్టిన కొత్త రూల్స్ తో సోనియా గాంధీ తన టికెట్ ని త్యాగం చేస్తారు అన్న చర్చ సాగుతోంది.

అంటే ఇక మీద  రాయబరేలీ నుంచి సోనియమ్మ ప్రాతినిధ్యం వహించదు అనే అంటున్నారు. మరి ఆ టికెట్ లో కుమారుడు రాహుల్ పోటీ చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఇలా తానుగా ఒక క్రమశిక్షణను విధించుకుని మరీ పార్టీ నేతలకు సోనియా దిశా నిర్దేశం చేశారు. పార్టీ బతికి బట్టకట్టాలీ అంటే  కుటుంబాల కోటలు చీల్చుకుని పార్టీ బయటకు రావాలి అన్న కాంగ్రెస్ ఆలోచనలకు ఇది అద్దం పడుతోంది.

అయితే ఈ రకమైన ఆలోచన అమలు అంత సులువేనా అన్న మాట అయితే ఉంది. కాంగ్రెస్ లో  నిజానికి ఉన్నవి ఫ్యామిలీస్ మాత్రమే.  అవి కూడా పలుకుబడి కలిగినవి. దశాబ్దాలుగా పాతుకుపోయినవి. మరి వారంతా ఒక్క టికెట్ తో సరిపెట్టుకుంటారా అన్నది కూడా ఆలోచించాలి.

ఏది ఏమైనా పార్టీని సమూలంగా మార్చేసే క్రమంలో కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పార్టీలోని ఔత్సాహికులకు, యువతకు  ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. మొత్తానికి అతి పెద్ద సంస్క‌రణల దిశగా కాంగ్రెస్ సాగుతోంది అన్న సంకేతాలను అయితే సోనియా గాంధీ ఇచ్చారు అనుకోవాలి.
Tags:    

Similar News