కేరళలో సీపీఎం నాయకురాలిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.విన్సెంట్ అత్యాచారం చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు విన్సెంట్ ను అరెస్ట్ చేశారు. సీపీఎం నాయకురాలైన 51 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి భర్త, కుమారుడు, బంధువుల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు.
ఈ కేసుకు విచారణ అధికారిగా కొల్లం సిటీ పోలీస్ కమిషనర్ ఎస్.అజీతా బేగం నియమితులయ్యారు. ఎమ్మెల్యే విన్సెంట్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా శాసనసభ స్పీకర్ పి.శ్రీరాం కృష్ణన్ ను కోరినట్టు ఆమె తెలిపారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే తమ అనుమతి అవసరమని, మిగతా సమయాల్లో అవసరం లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. దీంతో, విన్సెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు.
కేరళలో ఎమ్మెల్యే విన్సెంట్ అరెస్ట్‌తో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే అత్యాచారం చేసినట్లు బలమైన సాక్ష్యాలున్నట్టు తేలింది. దీంతో, కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఎమ్మెల్యే, బాధిత మహిళకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ ఆడియో క్లిప్ పోలీసులకు దొరికింది. ఎమ్మెల్యే అరెస్ట్‌పై మీడియాతో కేపీసీసీ చీఫ్ ఎంఎం హాసన్ మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అవసరమైతే రాజీనామా చేస్తానని విన్సెంట్ చెప్పినట్టు పేర్కొన్నారు.
కాగా, బాధిత మహిళ మీద అత్యాచారం చెయ్యడంతో ఆమె గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. నిత్యం తన భార్యతో ఫోన్లో నీచంగా మాట్లాడుతూ తనకు శారీరక సుఖం ఇవ్వాలని విన్సెంట్ తన భార్యను వేదిస్తున్నాడని ఆమె భర్త తెలిపారు. చివరికి అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ మీద అత్యాచారం కేసు నమోదు చేశామని కేరళ పోలీసులు తెలిపారు.