ఇందిరాగాంధీ లాగానే..కోమ‌టిరెడ్డిపై వేటు వేశారు

Update: 2018-03-14 04:30 GMT
తెలంగాణ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో అరాచకం సృష్టించి - మండలి చైర్మన్ కంటికి గాయం చేశారంటూ తెలంగాణ శాసనసభకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్‌ కుమార్‌ ల సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు దిగింది. అయితే ఇలాంటి ఉదంతాలు ఎన్నో గ‌తంలో జ‌రిగాయ‌ని అధికార టీఆర్ ఎస్ పార్టీ ప‌లు ఉదంతాలు వినిపిస్తోంది. ఓటుకునోటు కేసు స‌హా - దేశ రాజ‌కీయాల‌ను త‌నదైన శైలిలో ప్ర‌భావితం చేసిన మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీపైనా వేటేశార‌ని గుర్తు చేస్తోంది.

అనుచిత వ్యాఖ్యలు - అనుచిత ప్రవర్తనతో చట్టసభల గౌరవానికి భంగం కలిగించేలా - సభ హుందాతనాన్ని కించపరిచేలా వ్యవహరించిన ఏ సభ్యుడినైనా సభ నుంచి బహిష్కరించే అధికారం ఆయా చట్టసభలకు ఉంటుంది. చరిత్రలో ఇలాంటి బహిష్కరణ సంఘటనలను చాలానే ఉన్నాయి. భారత పార్లమెంటరీ వ్యవస్థను ఒక్క కుదుపు కుదిపిన ఓటుకు నోటు ఉదంతంలో ఒక్క వేటుతో 11 మంది ఎంపీలను లోక్‌ సభ నుంచి బహిష్కరించారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. చట్టసభల గౌరవానికి భంగం కలిగించేలా సభ్యులు ప్రవర్తిస్తే.. వారిని బహిష్కరించే అధికారం సభకు ఉంటుందని, ఈ బహిష్కరణకు ఎలాంటి న్యాయపరమైన అభ్యంతరాలు కూడా నిలువలేనివేనని స్పష్టంగా చాటిచెప్పిన సందర్భం అది. అంతెందుకు.. భారత పార్లమెంటరీ వ్యవస్థపై - దేశంపై తనదంటూ ముద్రవేసిన ఇందిరాగాంధీని కూడా దాదాపు సంవత్సరానికిపైగా బహిష్కరించిన చరిత్ర ఉంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 (3) ప్రకారం పార్లమెంట్‌ కు విశేషాధికారాలు ఉన్నాయి.

రాష్ర్టాల చట్ట సభలకు (శాసనసభ - శాసనమండలి) కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఆర్టికల్ 194 (3) ప్రకారం బాధ్యులైన సభ్యులను బహిష్కరించే అధికారం సభకు ఉంది. ఒకవేళ రాజ్యాంగంలోని ఆర్టికల్ 208(1) కింద సభ్యుడి బహిష్కరణకు ఎలాంటి ఆదేశిత అధికరణలను సిద్ధం చేయకున్నా.. ఆర్టికల్ 194(3)ద్వారా సభకున్న అధికారంతో సదరు సభ్యుడిని బహిష్కరించవచ్చని గత సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో సభ నుంచి సభ్యులను బహిష్కరించే అధికారం ఉందని మాజీ సొలిసిటర్ జనరల్ - సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జునకూడా తన రచనల్లో నొక్కివక్కాణించారు.

కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు

-సెప్టెంబర్ 25 - 1951 నాడు లోక్‌సభ సభ్యుడు హెచ్.జి.ముద్గల్‌ ను సభ నుంచి బహిష్కరించారు.

-అనుచిత ప్రవర్తనతో సభాగౌరవాన్ని భంగపర్చినందుకు నవంబర్ 15 - 1976న సుబ్రమణ్యస్వామిని రాజ్యసభ నుంచి బహిష్కరించారు.

-దేశ చరిత్రలోనే ప్రముఖ స్థానం సంపాదించుకున్న ప్రధానిగా పేరుగాంచిన ఇందిరాగాంధీని నవంబర్ 18 - 1977న లోక్‌ సభ నుంచి బహిష్కరించారు.

-భారత పార్లమెంటరీ చరిత్రలో తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటనల్లో ఒకటైన ఓటుకు నోటు వ్యవహారంలో డిసెంబర్ 23 - 2005న 11 మంది ఎంపీలను సభ నుంచి బహిష్కరించారు.

-అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో ఏపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.

-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కరణం బలరాంను 2008 మార్చిలో ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్‌పై కరణం బలరాం ప్రకాశం జిల్లాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

-జూన్ 13 - 1964న మహారాష్ట్ర శాసనసభకూడా ఒక సభ్యుడిని సభ నుంచి బహిష్కరించింది.

-కేరళ శాసనసభలో 2015 - మార్చి 13న బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రిపట్ల దురుసుగా ప్రవర్తించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదుమేరకు పోలీసు కేసు నమోదుచేశారు.
Tags:    

Similar News