స్పీకర్ ఆగ్రహం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Update: 2020-03-07 09:55 GMT
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ సమావేశాల్లో తొలిసారిగా గవర్నర్ హోదాలో తమిళ సై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు శనివారం సమావేశాలు కొనసాగాయి. అయితే అసెంబ్లీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీలో గలాటా సృష్టించారని భావించి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ సభ్యుల ను స్పీకర్ పలుమార్లు వారించినా.. వినకపోవడంతో వారిని ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై సభలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించేందు కు సిద్ధమవుతుండ గా మరికొన్ని అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. తమకు కొద్దిసేపు అవకాశం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోడియంలో కి దూసుకువచ్చారు.

దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సమాధానం తర్వాత క్లారిఫికేషన్లకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పారు. అయినా వినకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డితో సహా సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగా అడ్డుకున్నారు. దీంతో మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌కు తీర్మానం ప్రతిపాదించగా.. వెంటనే స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

అవకాశం ఇవ్వకపోగా తమను సస్పెన్షన్ చేయడంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన తీవ్రం చేశారు. సస్పెండ్ చేసినా బయటకు వెళ్లకపోవడంతో స్పీకర్ మార్షల్స్ సహాయం తో బయటకు పంపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలను సభనుంచి బయటికి తరలించారు. వారు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అసెంబ్లీ బయటకు వచ్చి ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News