తెలంగాణలోని స్థానిక సంస్థలకు జరుగుతున్న శాసన మండలి ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విపక్షాలకు భారీ షాకులే ఇస్తున్నాయి. ఈ సందర్భంగా చోటు చేసుకుంటున్న కొన్ని సీన్లు చూసిన పార్టీలకు నోట మాట రావటం లేదు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాలకు కాంగ్రెస్ పార్టీ నోటి వెంట మాట రాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.
మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న శివరాజ్ పాటిల్ ను శుక్రవారం తెలంగాణ మంత్రి హరీశ్ రావు తన సొంత ఇన్నోవాలో కలెక్టరేట్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇన్నోవాలో మంత్రి హరీశ్ తో పాటు.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి.. గూడెం మహిపాల్ రెడ్డిలు ఉన్నారు. వారితో కలిసి వెళ్లిన శివరాజ్ పాటిల్ కలెక్టరేట్ కు వెళ్లి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి తప్పుకున్న శివరాజ్ పాటిల్ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ కు మరో షాకిచ్చారు. భారీగా నామినేటెడ్ పదవులకు సంబంధించి హామీనే ఇలాంటి పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. పోల్ మేనేజ్ మెంట్ లో ఆరితేరినట్లుగా భావించే టీఆర్ఎస్ పార్టీ.. నామినేషన్ల సమయంలో పన్నుతున్న వ్యూహాలకు విపక్షాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది.