పులిహోర కలుపుతున్న కాంగ్రెస్..!

Update: 2021-08-24 03:08 GMT
రాజకీయాలు కూడా వంట లాంటి  ప్రయోగమే. అందుకే నాయకులు లెక్కలేనన్ని ప్రయోగాలు చేసుకుంటూ పోతారు. విషయనికి వస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని కనీసంగా 150 సీట్లు అయినా సొంతంగా తెచ్చుకోమని ఆ పార్టీ కొత్త వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారట. దాంతో ఎక్కడ నుంచి అన్ని సీట్లు వస్తాయి అని కాంగ్రెస్ ఇపుడు భూతద్దంలోనే వెతుకుతోంది. ఎపుడో 2004, 2009 ఎన్నికలలో ఉమ్మడి ఏపీలో సీట్లు దండీగా రావడంతో రెండు మార్లు కేంద్రంలో అధికారలోకి కాంగ్రెస్ వచ్చింది. అందుకే ఇపుడు కూడా అలాంటి ఆలోచన చేస్తున్నార‌ట. ఎటూ తెలంగాణాలో రేవంత్ రెడ్డిని కొత్త పీసీసీగా నియమించాక పార్టీ పరుగులు పెడుతోంది కాబట్టి ఏపీలో కూడా అలాంటి వారినే తెస్తే బాగుంటుంది అన్నదే కాంగ్రెస్ యోచనట.

ఈ మధ్యన రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నాయకులు మీట్ అయినపుడు ఏపీ ఎలా ఉంది అని రాహుల్ అడిగారట. ఏపీలో 2024లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి రావాలని ఆయన అనడంతో ఏపీ కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారుట. రాహుల్ ఇంకా 2004 నాటి రోజులలోనే ఉండిపోయారా అని డౌట్ కూడా వచ్చిందట. సరే విభజన పాపంతో కాంగ్రెస్ మూడు లోతుల పాతాళానికి దిగబడిపోయింది అన్న సంగతి కూడా తెలియకుండా భావి ప్రధాని ఇలా ఆలోచించడమేంటని కూడా అనుకున్నారుట. ఇక ఏపీలో కాంగ్రెస్ ని పైకి లేపే వారు ఎవరు అంటూ శోధన కూడా చేస్తున్నారుట.

అయితే ఒక్కరు ఏపీకి సరిపోరు అన్న నిర్ణయానికి కూడా హై కమాండ్ వచ్చేసింది. అందుకే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు, వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు, వీలైతే కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పల్లం రాజు, చింతా మోహన్ లాంటి వారిని అందరికీ కలపి ఒక అతి పెద్ద శక్తిగా తయారు చేయాలనుకుంటున్నారుట. ఇందులో కులాలు, ప్రాంతాల‌ సమీకరణలు కూడా సరిపోతాయని ఆలోచిస్తున్నారుట. మొత్తానికి ఇంత మంది నాయకులు ఉన్నారు కదా ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టి వైసీపీలో ఉన్న మన వాళ్ళను తీసుకురండి అంటూ రాహుల్ కొత్త పురమాయింపు కూడా చేశార‌ట.

అసలే ఏపీలో  కాంగ్రెస్ ఎక్కడ అని వెతుకుతున్న వేళ హాయిగా అధికార పార్టీలో ఉన్న వారిని పిలిస్తే వస్తారా. మొత్తానికి రాహుల్ కి ఇన్నేళ్ళ తరువాత ఏపీ గుర్తుకు రావడమే ఒక వింత అయితే ఆయన ఒకే ఒక్క  మీటింగులోనే ఎన్నెన్నో వింతలు చూపించారని కాంగ్రెస్ నేతలు ఉసూరుమంటున్నారుట. మొత్తానికి ఏపీలో కాంగ్రెస్ ని లేపేందుకు మళ్ళీ మళ్లీ పిలుస్తాను అంటూ రాహుల్ చివరాఖరున ఇచ్చిన ట్విస్ట్ తోనే నేతలు అంతా ఖంగు తింటున్నారుట. అయినా ఏపీ అంటే ఎంత నమ్మకమో రాహుల్ కి అని అంతా అనుకుంటున్నారు అంటే అందులో వింతేముంది మరి.
Tags:    

Similar News