కాంగ్రెస్‌ లో టెన్ష‌న్‌...ఎమ్మెల్సీ బ‌రిలో ఉందామా వ‌ద్దా?

Update: 2019-03-04 06:12 GMT
కీల‌క స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్‌ లో డైల‌మా ఏర్ప‌డింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. బ‌రిలో ఉండాలా వ‌ద్దా అంటూ ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కావడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కలుపుకొంటే తమకు సంఖ్యాబలం సరిపోతుందని కాంగ్రెస్ భావించింది. కానీ ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు కాంగ్రెస్‌ కు షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పనితీరుకు ఫిదా అయ్యామ‌ని, త్వ‌ర‌లో టీఆర్‌ ఎస్‌ లో చేరనున్నామ‌ని ప్ర‌క‌టించారు.


21 మంది ఎమ్మె ల్యేల బలం ఉన్నదన్న నమ్మకంతో కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి అభ్యర్థిని బరిలో నిలిపింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ గూడూరు నారాయణరెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్‌ కు ముగ్గురు తగ్గడంతో గూడూరు నారాయణరెడ్డి బరిలో ఉంటారా? తప్పుకుంటారా? అనే అయోమయం నెలకొంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్‌ తో కాంగ్రెస్ బలం 19 నుంచి 17కు పడిపోయింది. మరోవైపు టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకే మద్దతు ఇస్తారన్న ఆశలపైనా నీళ్లు చల్లినట్టయింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని, టీఆర్‌ ఎస్‌ లో చేరుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ముగ్గురు ఎమ్మెల్యేల లోటు ఏర్పడింది.

సంఖ్యాబలం లేకుండా పోటీచేయడం మంచిది కాదని చాలా మంది కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. ఇలా పోటీచేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సీఎల్పీ సమావేశంలో నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గూడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీ బరిలోనుంచి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్నది. ఆలోగా కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటే టీఆర్‌ ఎస్ పార్టీ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు చొప్పున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా గెలుస్తారు. దీంతో గులాబీ ద‌ళ‌ప‌తి ప్లాన్ వ‌ర్కవుట్ కానుంది.
Tags:    

Similar News