మాలో కలిపేయండి: కోదండకు కాంగ్రెస్ సూచన

Update: 2018-12-19 04:32 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలనుకున్న ప్రజాకూటమికి దారుణమైన దెబ్బ తగిలింది. ఎవరి ఊహకు అందనంత ఎత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. దీంతో మరో 5 ఏళ్ల పాటు తెలంగాణలో ప్రతిపక్షాలు ఉద్యమాలకే పరిమితం అయ్యాయి. ఈ దశలో ఉద్యమం నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి మనుగడ ప్రశ్నార్దకంగా మారింది. ఆ పార్టీకి తెలంగాణ ముందస్తు ఎన్నికలలో మంచి ఫలితాలు రాకపోయిన ప్రజాదరణ మాత్రం బాగానే ఉందని తేలింది. అయితే రానున్న 5 సంవత్సారాలు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. గతంలో మెగా స్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో పాటు అనేక పార్టీలు జాతీయ పార్టీలలో విలినమయ్యాయి. 5 సంవత్సరాల పాటు పార్టీ కార్యలయాలకు అద్దెలు చెల్లించడం - ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక చర్యలపై ఆందోళన చేపట్టడం వంటివి తెలంగాణ జన సమితి వంటి చిన్న పార్టీలకు సాధ్యం కాదు. అయితే ఎన్నికల ముందు పుట్టి ఆ తర్వాత పార్టీ ఎత్తేసారనే అపవాదు తలకెత్తుకోవడం మంచిది కాదని కోదండరామ్ అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ పరిస్దితులలో తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఆ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు.

నలుగు రోజుల క్రితం తెలంగాణ ముందస్తు ఎన్నికలపై తెలంగాణ జన సమితి కార్యలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కాంగ్రెస్‌ కు దూరంగా ఉండాలని కొందరు నాయకులు ప్రతిపాదించినట్లు చెప్పారు. అయితే పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ మాత్రం భవిష్యత్తులో తెలంగాణ జన సమితి బలపడాలన్న ప్రభుత్వంపై ఉద్యమించాలన్న కాంగ్రెస్ పార్టీ అండ ఉండాలని అన్నట్లు సమాచారం. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత మూడు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హజరయిన కోదండ రామ్‌ తో రాహుల్ గాంధీ విలీన అంశం ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తెలంగాణ జన సమితి కాంగ్రెస్‌లో విలీనమయితే తెలంగాణలో మేథోపరంగాను - ఉద్యమ రూపంలోను బాగుంటుందని రాహుల్ ప్రతిపాదించినట్లు సమాచారం. మూడు హింది బెల్ట్ రాష్ట్రాలలో సాధించిన విజయంతో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. భవిష్యత్తు తమదేనని కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమేనని దీమాగా ఉంది. ఇదే విషయాన్ని కోదండరామ్‌ తో చెప్పి తెలంగాణ ఎన్నికలలో ఓడిపోయిన తమతో విలీనం అయితే జాతీయ స్దాయిలో మంచి పదవులు ఇస్తామంటూ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే కోదండరామ్‌ మాత్రం లాంటి హామీ ఇవ్వలేదని తమ నాయకులతో చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని రాహుల్‌ తో అన్నట్లు సమాచారం.


Tags:    

Similar News