కరోనా టైంలో ఎగబడి కొంటోన్న వస్తువులివే!!

Update: 2020-08-08 01:30 GMT
కరోనా, లాక్ డౌన్.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కరోనా బారిన పడిన కోటీశ్వరులు సైతం కోలుకోలేక మృత్యువాతపడ్డారు. డబ్బే సర్వస్వం కాదని...ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం గొప్పదని...ఆరోగ్యమే మహాభాగ్యమని కరోనా మనకు వార్నింగ్ బెల్ ఇచ్చింది. ఉద్యోగం, వ్యాపారంతోపాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలని తెలియజెప్పింది. ఒక మనిషికి పొదుపు ఎంత అవసరమో ...దుబారా ఖర్చులు తగ్గించడం ఎంత ముఖ్యమో తెలియజెప్పింది. పొదుపు చేసుకున్న సొమ్ము ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అక్కరకు వస్తుందని తెలియజెప్పింది. అందుకే, కరోనా వేళ భారతీయులు అనవసర ఖర్చులకు పోకుండా ఆరోగ్యానికి, ఇంటి, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి మాత్రమే డబ్బు ఖర్చు పెడుతున్నారు.

ఉప్పు పప్పు....నిత్యావసరాలు....కూరగాయల కొనుక్కొని తమ వంటిల్లు నింపుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. కరోనా కనికట్టు నుంచి తప్పించుకోవడానికి, మహమ్మారి ఆట కట్టించడానికి ఇళ్లకే పరిమితమై సరికొత్త జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు చేస్తున్నారు. కరోనాను తరిమికొట్టడంలో వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి శుభ్రత, పరిసరాల శుభ్రత చాలా అవసరం. అందుకే, కరోనా టైంలో ఇమ్యూనిటీ బూస్టర్లు, కంఫర్ట్ ఫుడ్స్, డిజిటల్ సర్వీసెస్, గోల్డ్ లోన్స్, అప్లయెన్సెస్ కొనేందుకు వినియోగదారులు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.


కరోనాపై పోరులో భారతీయుల ప్రాధాన్యతలు మారాయి. కరోనా కట్టడికి ఎంతో కీలకమైన రోగ నిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు ఇమ్యూనిటి బూస్టర్లు, శానిటైజర్లు కొంటున్నారు. అందుకోసం ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేస్తోన్న డాబర్, హిమాలయ తదితర కంపెనీలకు గిరాకీ పెరిగింది. కంఫర్ట్ ఫుడ్స్ విషయంలో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. రైస్, ఆయిల్, కందిపప్పు వంటి నిత్యావసరాలను స్టాక్ పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో...చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. లాక్ డౌన్ వల్ల ప్రజల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో, సమావేశాలకు జూమ్ యాప్, విద్య పరంగా బైజూస్ వంటి ఎడ్యుకేషనల్ యాప్స్...ల్యాప్ టాప్స్ అమ్మకాలకు ఆదరణ పెరిగింది. ఇక, జీ5 వంటి ఓటీటీ ప్లాట్ ఫాంలు తమ యూజర్ల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి.

కరోనాతో ఉద్యోగ,వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. దీంతో, కుటుంబ పోషణకు బంగారం తాకట్టు పెట్టేందుకు సైతం చాలామంది వెనుకాడలేదు. మూత్తూట్ ఫైనాన్స్ బిజినెస్ ఈ ఏడాది ఏకంగా 57 శాతం పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, లాక్ డౌన్ సమయంలోనూ ఆర్థిక ఇబ్బందులు పెద్దగా లేని కేటగిరీ ఒకటుంది. వారంతా ఎప్పటిలాగే తమకు కావాల్సిన హోం కేర్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను కొంటున్నారు. కరోనా నేర్పిన పాఠాలు...ఒక జీవిత కాలానికి సరిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.


Tags:    

Similar News