అమెజాన్ తో అరవోళ్ల గొడవ

Update: 2015-10-16 09:58 GMT
ఈ-కామర్స్ దిగ్జజం అమెజాన్ ఫెస్టివ్ సీజన్ లో ప్రారంభించిన బిగ్ సేల్ తమిళనాట కొత్త వివాదానికి దారితీసింది. ఈ నెల 13 నుంచి 17 మధ్య అమెజాన్ భారీ ఆఫర్ లతో ప్రత్యేక సేల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తేదీల మధ్య కొనుగోలు చేసిన కస్టమర్ల పేర్లతో లక్కీ డ్రా తీసి కేజీ బంగారం ఇస్తామని అమెజాన్ మరో ఆఫర్ పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పత్రికల్లో మొదటి పేజీల్లో పెద్ద పెద్ద ప్రకటనలు చేసింది. అయితే.... ఈ అన్ని ఆఫర్లు వర్తించినా కేజీ బంగారం ఆఫర్ మాత్రం తమిళనాడు ప్రజలకు వర్తించడం లేదట... ఆ డ్రాకు తమిళనాడు ప్రజలకు అనుమతి లేదంటూ అక్కడి ప్రకటనల్లో అమెజాన్ పేర్కొంది. దీంతో తమిళులు మండిపడుతున్నారు.

తమిళనాడు అంతటా పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి, దాని ద్వారా పెద్ద ఎత్తున అమ్మకాలు చేసిన అమెజాన్ తమకు డ్రాలో అవకాశం లేదని చెప్పడం మోసగించడమేనని వారు మండిపడుతున్నారు. నిజానికి తమిళనాడులో ఇలాంటి బహుమతుల పథకాలపై నిషేధం ఉంది. కాబట్టి తమిళనాడు నుంచి కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆన్ లైన్లో డ్రాకు అనర్హులంటూ కనిపిస్తోంది. అయితే... అమెజాన్ పేపర్లలో ఇచ్చిన ప్రకటనల్లో ఈ విషయం ప్రస్తావించలేదు. కానీ, నిబంధనల ప్రకారం డ్రాకు అనర్హత విధిస్తోంది. పేపర్లలో ప్రకటనలు ఇచ్చినప్పుడే రాష్ట్రంలో ఉన్న నిషేధం కారణంగా డ్రాకు తమిళనాడు కస్టమర్లు అనర్హులని చెబితే ఇబ్బంది ఉండేది కాదు. కానీ, అలా చేయకపోవడంతో తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు... తంతై పెరియార్ ద్రవిడ కజగం సంస్థ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కస్టమర్లను తప్పుడు ప్రకటనతో మోసగించి పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందిన అమెజాన్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అక్కడ పెరుగుతోంది.
Tags:    

Similar News