కరోనా 2.0 : కొత్త‌ లక్షణాలు ఇవే! వాటికీ లెక్కల్లేవ్!

Update: 2021-04-18 05:48 GMT
కొవిడ్ సెకండ్ ఎంత వేగంగా విజృంభించిందో.. అంత దారుణంగా ప్ర‌భావం చూపిస్తోంది. అయితే.. ఇందులో మ‌రింత ఆందోళ‌న క‌లిగించే విష‌యం ఏమంటే.. ఇప్పుడు కొవిడ్ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయ‌నేది స్ప‌ష్టంగా తెలియ‌ట్లేదు! ఎన్నో ర‌కాలుగా రూపాంత‌రం చెందిన వైర‌స్‌.. వేగంగా ప్ర‌భావం చూపుతోంది. దీంతో.. ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డే లోపే వ్యాధి ముదిరిపోతోంది. అంతేకాకుండా.. గ‌తంలో మాదిరిగా స్ప‌ష్ట‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ట్లేదు.

క‌రోనా మొద‌టి ద‌శ‌లో ల‌క్ష‌ణాలు కాస్త స్ప‌ష్టంగానే ఉండేవి. జ్వ‌రం, జ‌గ్గు, జ‌లుబు, వాస‌న, రుచి కోల్పోవ‌డం వంటివి ప్ర‌ధానంగా ఉండేవి. కానీ.. ఇప్పుడు అంతుబ‌ట్ట‌ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. కొంద‌రిని త‌ల‌నొప్పి, వెన్ను, గొంతు నొప్పి బాధిస్తున్నాయి. మ‌రికొందరిలో క‌ళ్లు ఎర్ర బ‌డుతున్నాయి. చ‌ర్మంపై మ‌చ్చ‌లు, నోట్లో పొక్కులు వ‌స్తూ.. ఆక‌లి మంద‌గిస్తోంది. ఇంకొంద‌రిలో విరేచ‌నాలు కూడా ఉంటున్నాయి.

ఇంకొంద‌రిలో మూడు నాలుగు రోజులు జ్వ‌రం వ‌చ్చిన త‌ర్వాత త‌గ్గిపోయి.. మ‌ళ్లీ వ‌స్తోంది. ఇలా జ‌రిగిన వారిలో వ్యాధి తీవ్రత‌ మ‌రింత‌గా ముదిరిపోతోంద‌ని చెబుతున్నారు వైద్యులు. ఈ కొత్త ల‌క్ష‌ణాల‌తో త‌మ‌కు కొవిడ్ సోకిందా? లేదా? అని చాలా మంది త్వరగా నిర్ధారించుకోలేకపోతున్నారు. దీంతో.. ఆల‌స్య‌మ‌వుతున్న కొద్దీ న‌ష్టం ఎక్కువ‌గా జ‌రుగుతోంద‌ని చెబుతున్నారు.

ఆర్టీపీసీఆర్ టెస్టుల్లోనూ స‌రిగా తేలట్లేద‌ని, సీటీ స్కాన్ లో మాత్ర‌మే ఊపిరితిత్తులు ఎంత‌గా దెబ్బ‌తిన్నాయో తేలుతోంద‌ని చెబుతున్నారు. గ‌తంలో వైర‌స్ సోకిన త‌ర్వాత లంగ్స్ దెబ్బ తిన‌డానికి 5 రోజులు ప‌ట్టేదని, ఇప్పుడు ఆ స‌మ‌యం మూడు రోజుల‌కే త‌గ్గిపోయింద‌ని చెబుతున్నారు. దీంతో.. ఆరోగ్య‌వంతులుగా ఉన్న‌వారు కూడా వైర‌స్ సోకిన‌ మూడు నాలుగు రోజుల్లోనే కుప్ప‌కూలుతున్నార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో బ్రిట‌న్‌, ద‌క్షిణాఫ్రికా, బ్రెజిల్ లో వెలుగు చూసిన ప్ర‌మాద‌క‌ర వేరియంట్లు రాజ్య‌మేలుతున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ని వారు వ్యాధిని తీవ్రంగా వ్యాపింప‌జేస్తున్నార‌ని అంటున్నారు. అందువ‌ల్ల‌.. ఎవ్వ‌రికైనా జ్వ‌రం, పొడి ద‌గ్గు, నీర‌సం, త‌ల‌నొప్పి, వెన్ను నొప్పి, ఆయాసం, ఛాతిలో ఇబ్బంది ఉన్న‌వారు.. జ్వ‌రం వ‌చ్చి త‌గ్గిన త‌ర్వాత మ‌ళ్లీ వ‌చ్చిన వారు వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు. ఈ ప‌రిస్థితి రాకుండా.. త‌ప్ప‌కుండా మాస్క్ వాడాల‌ని, శానిటైజ‌ర్లు వాడాల‌ని సూచిస్తున్నారు.
Tags:    

Similar News