కరోనా ఎఫెక్ట్ : ఇటలీ ఎయిర్‌పోర్ట్‌ లో నరకం చూస్తున్న తెలుగు విద్యార్థులు !

Update: 2020-03-18 00:30 GMT
ఇటలీ దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ కారణంగా 50 మంది తెలంగాణ - ఆంధ్ర - కేరళ విద్యార్థులు ఇటలీలోని రోమ్‌ ఎయిర్‌ పోర్టులో చిక్కుకున్నారు. తెలంగాణకు చెందిన 15 మంది విద్యార్థుల తో పాటు ఆంధ్రప్రదేశ్‌ - కేరళ రాష్ర్టాలకు చెందిన వారితో కలిపి మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నట్టు అక్కడి నుంచి విద్యార్థులు ఫోన్‌ లో సమాచారాన్ని పంపారు. వీరిలో నిర్మల్‌ కు చెందిన లక్కాకుల అజయ్‌ కుమార్‌ - నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన హరీష్‌ రావుట్ల అనే విద్యార్థులు కూడా ఉన్నారు. తమను ఎలాగైనా ఎయిర్‌ పోర్టు నుంచి ఇండియాకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

11వ తేదీన ఇండియాకు టికెట్‌ లు రిజర్వేషన్‌ చేసుకున్న తమను అక్కడనే బందీలుగా ఉంచారని - ఇండియాకు తీసుకెళ్లేందుకు ఎంబసీ అధికారులు గానీ భారత ప్రభుత్వం గానీ చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చైనా తరువాత అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతుండడం.. మరణాలు కూడా భారీగానే జరుగుతుండడం తో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులను ఇటలీ దేశం వెనక్కి పంపిస్తోంది. రోమ్‌ నగరంలో ఇంజనీరింగ్‌ చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులు అనేక మంది ప్రస్తుతం ఇటలీ ఎయిర్‌ పోర్టులో ఇండియాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వారిని ఇటలీ దేశం ఇండియాకు పంపకుండా.. ఎయిర్‌ పోర్టులోనే బందీలుగా ఉంచిందంటూ విద్యార్థులు రోదిస్తూ ఇక్కడికి సమాచారాన్ని అందజేశారు. రహస్యంగా వీడియోలు తీసి సోమవారం పోస్టు చేశారు.

ఒకే గదిలో సుమారు 50మంది విద్యార్థులను ఉంచిన ఇటలీ ఎయిర్‌ పోర్టు సిబ్బంది వారికి కనీస సౌకర్యాలను కల్పించడం లేదన్నారు. అయితే అడపాదడపా భారత ఎంబసీ అధికారులు విద్యార్థులకు ఆహార సరఫరాను మాత్రం అందజేస్తున్నారని చెప్పారు. అయితే తమను ఇండియాకు అసలు పంపుతారా లేదా అన్నది తెలియక విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందారు. కరోనా పేరుతో ఇటలీ ఎయిర్‌ పోర్టులో వారం రోజులుగా తమను ఉంచుతున్నారని, క్షణమొక గండంలా గడపాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఏడుస్తూ ఇక్కడికి వీడియోను పంపారు. భారత ఎంబసీ అధికారులు అప్పుడప్పుడు ఆహారం అందించడం తప్ప తమను ఇండియాకు పంపించే చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
Tags:    

Similar News