మైక్రోనేషియాలో తొలి కరోనా కేసు

Update: 2021-01-11 23:30 GMT
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అన్ని దేశాలకు పాకింది. ప్రపంచాన్ని గుప్పిట పట్టి ఏడాదిగా అల్లాడిస్తోంది. యూరప్ లో రెండో దశ లాక్ డౌన్ కూడా మొదలైంది. ఇక కరోనా పీడ పోయిందనుకుంటున్న సమయంలో ఆ వైరస్ రూపాంతరం చెంది కొత్త కరోనా స్ట్రెయిన్ గా మారి మరోసారి మరణ మృదంగం వాయిస్తోంది.

ముఖ్యంగా శీతల దేశాలైన యూరప్ సహా దక్షిణాఫ్రికా, జపాన్ తదితర దేశాల్లో కొత్త కరోనా స్ట్రెయిన్ వల్ల వేల కేసులు.. వందల మరణాలకు కారణం అవుతోంది.

అయితే ఇప్పటిదాకా ఈ ప్రపంచం మీద కరోనా చేరని కొన్ని దేశాలు ఉన్నాయి. అయితే అవి పెద్ద దేశాలు కాదు.. సముద్రాల్లో ఉన్న బుల్లిబుల్లి దేశాలు. కరోనా ప్రబలిన వేళ ఆదేశంలోకి విదేశీయులను రానీయకపోవడంతో కరోనా ఈ ద్వీపదేశాల్లోకి ప్రవేశించలేదు. అలాంటి దేశమే ‘మైక్రోనేషియా’.. ఇప్పుడా ఆ దేశంలోనూ కరోనా వెలుగుచూసింది.

ఇంతకాలం కరోనా చొరబడని దేశంగా ఉన్న మైక్రోనేషియా తాజాగా ఇప్పుడు ఆ గుర్తింపు కోల్పోయింది. ఫిలిప్పైన్స్ లో మరమ్మతులో ఉన్న మైక్రోనేషియా ప్రభుత్వ నౌకలో సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు డేవిడ్ పాన్యులో హెచ్చరించాడు.

సరిహద్దుల వద్దే ఈ కేసును కట్టడి చేశామని అధ్యక్షుడు తెలిపారు. దేశంలో వ్యాపారులు, పాఠశాలలు, చర్చిలు యధాతథంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.




Tags:    

Similar News