క‌రోనా దారుణంః అంతా మీరే చేస్తున్నారు!

Update: 2021-05-01 15:30 GMT
గ‌తేడాది లాక్ డౌన్ లో అనుభ‌వించిన చిరాకు ఓ ప‌క్క‌.. జ‌న‌వ‌రి త‌ర్వాత వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌న్న ధీమా మ‌రో ప‌క్క‌.. వ్యాక్సిన్ కూడా వ‌చ్చేసిందిలే అన్న ధైర్యం ఇంకో ప‌క్క‌.. ఇవ‌న్నీ ఒకెత్త‌యితే.. అల‌విమాలిన నిర్ల‌క్ష్యం ఇంకో ఎత్తు. ఈ నాలుగు కార‌ణాల‌తో జ‌నం ఇష్టారీతిన తిర‌గ‌డం మొద‌లు పెట్టాం. మాస్కులు పెట్టుకోవ‌డాన్ని అస‌లే వ‌దిలేశాం. శానిటైజ‌ర్ ను ప‌క్క‌కు విసిరేశారు. భౌతిక దూరాన్ని దూరం పెట్టేశాం!

ఫ‌లితం ఏమొచ్చిందీ..? రోజుకు 4 లక్షల కేసులు నమోదయ్యే దాకా తెచ్చుకున్నాం. నిత్యం 3 వేల మందికిపైగా చంపేసుకుంటున్నాం. త‌ల్లుల‌కు గ‌ర్భ‌శోకాన్ని మిగిలిస్తూ.. ఆయా కుటుంబాల‌కు జీవితంలోనే తీర‌ని శోకాన్ని మిగిలిస్తున్నాం. అయితే.. ఇందులో ప్ర‌ధాన వాటాదారులు ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రు? రోడ్ల మీద అలక్ష్యంతో తిరిగే బ్యాచేనట!

అవును.. కొవిడ్ సెకండ్ విజృంభించ‌డానికి యువ‌కులే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వైద్య నిపుణులు తేల్చేశారు. అయితే.. వాళ్లు ఊరికే అభాండాలు వేసేయ‌ట్లేదు. కార‌ణాల‌ను ప‌క్కాగా చూపెడుతున్నారు. విశ్లేష‌ణ చేసి నిరూపిస్తున్నారు. యువ‌కుల దేహం దూకుడు మీద ఉంటుంది. కాబ‌ట్టి క‌రోనా అంత త్వ‌ర‌గా వారిపై ప్ర‌భావం చూప‌దు అంటున్నారు. అంతేకాదు.. జ‌లుబు, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు వ‌స్తే.. వాటిని లైట్ తీసుకుంటార‌ని చెబుతున్నారు. అంటే.. నిర్ల‌క్ష్యంగా వ‌దిలేస్తార‌ని అంటున్నారు. అలా వదిలేసి ఇంట్లో కూర్చోరు క‌దా.. ఎక్క‌డెక్క‌డో తిరిగేస్తుంటారు. తిరిగిన చోట‌ల్లా పూసేస్తుంటారు.

ముందుగా చెప్పుకున్న‌ట్టు యువ‌త‌కు ఇమ్యూనిటీ ఎక్కువ క‌దా.. అందువ‌ల్ల‌ ఆల‌స్యంగా కొవిడ్ బ‌య‌ట‌ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి బ‌లంతో దాన్ని ఓడిస్తారు కూడా. కొన్నాళ్లు ఆసుప‌త్రిలో ఉండి ఇంటికి వ‌చ్చేస్తారు. మ‌రి, వీళ్లు అంటించి వ‌చ్చిన వారి సంగ‌తేంటీ? వారిలో మధ్య వయసు వారు ఉండొచ్చు.. వృద్ధులు ఉండొచ్చు.. పిల్ల‌లు కూడా ఉండొచ్చు.

వీరిలో యువ‌త మీద త‌ప్ప‌, మిగిలిన వారంద‌రిమీదా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది వైర‌స్‌. ఇక‌, వారిలో దీర్ఘ‌కాలిక రోగాలు ఉంటే అంతే సంగ‌తులు. చేత‌గాని వాడిపై బ‌ల‌వంతుడు దాడిచేసిన‌ట్టు.. వైర‌స్ చీల్చి చెండాడుతోంది. అన్యాయంగా ప్రాణాలు తీసేస్తోంది.

ఇంత‌కు మించిన‌ దారుణం ఏమైనా ఉంటుందా? ఎవ‌రో అంటించిన రోగానికి ఇత‌రులు ప్రాణం పోవ‌డం ఏమైనా న్యాయంగా ఉందా? ఒక ప్రాణం పోతే.. అత‌నిపై ఆధార‌ప‌డిన వారి ప‌రిస్థితి ఏంటీ? చిన్న పిల్లలు ఉంటే.. వారి భవిష్యత్ ఏంటీ..? వారు మరణించిన మరుసటి రోజు నుంచి వారి జీవితం ఎలా సాగుతుందో తెలుసా? ఒక్క‌మాట‌లో చెప్పాలంటే..''దుర్భ‌రం''. కాబ‌ట్టి.. ద‌య‌చేసి, ఇకనైనా అంద‌రూ మాస్కులు ధ‌రించండి, భౌతిక దూరం పాటించండి, అవ‌స‌రం లేక‌పోతే వైర‌స్ ఉధృతి త‌గ్గేవ‌ర‌కూ బ‌య‌ట‌కు వెళ్ల‌కండి. ఇదే.. ఇప్పుడు అంద‌రూ చేయాల్సింది.
Tags:    

Similar News