కరోనా అర్థమండల దీక్ష ఇప్పుడు చాలా.. చాలా అవసరం

Update: 2021-04-20 03:54 GMT
సామాన్యుల నుంచి సీఎం వరకు కరోనా బాధితులే. అనునిత్యం బోలెడన్ని జాగ్రత్తలు తీసుకునే వారినే వదలని కరోనా.. మనలాంటి సామాన్యుల్ని ఇట్టే పట్టేయటం ఖాయం. ఇలాంటి వేళలో.. దాని బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలి? ఆ అవకాశం ఎంత ఉంది?  అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా దగ్గరకు రాకుండా నిరోధించే శక్తి మన దగ్గర లేదు. కాకుంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం.

ప్రస్తుతానికి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోజుకు 2.5లక్షల కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరగటం ఖాయం. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యం.. కోవిడ్ నిబంధనలు పట్టకపోవటం లాంటివి మరింతగా సాగితే.. రోజుకు ఐదారు లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈసారి వైరస్ తీవ్రత జులై నెలాఖరు వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. రానున్న మూడు వారాలు (21 రోజులు) చాలా కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. వైరస్ బారిన పడకుండా ఉండటానికి అందరికి ఉన్న ఏకైక మార్గం.. ముఖానికి మాస్కును జాగ్రత్తగా ఉంచుకోవటమే. టీకా తీసుకున్నప్పటికి ముఖానికి మాస్కు తప్పనిసరి. ప్రస్తుతం గాల్లో వైరస్ ఉన్న నేపథ్యంలో అందరూ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూసి ఉన్న ప్రదేశాల్లోనూ..భవనాల్లో 20 అడుగుల దూరం వరకు వైరస్ వ్యాపించే వీలుంది. మాస్కు ధరిస్తే 80 శాతం రక్షణ ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ.. అందరూ మాస్కులు ధరిస్తే 99 శాతం వరకు రక్షణే.

వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రానున్న 21 రోజులు చాలా కీలకమని చెబుతున్నారు. వైరస్ పరివర్తనం చెందే వేళలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా ఉద్రతి మరో మూడు వారాలు ఉండనుంది. ఇలాంటి సమయంలో.. వైరస్ వ్యాపించకుండా ఉండటానికి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోగలిగితే.. ఈ గండం నుంచి బయటపడే వీలుంది. అయ్యప్ప మండలం దీక్ష మాదిరే.. కరోనా అర్థ మండల దీక్ష తీసుకోవటం.. చేతికి శానిటైజర్.. ముఖానికి మాస్కు.. కళ్లకు కళ్లజోడు.. వీలైనంతగా బయటకు తక్కువగా వెళ్లటం.. కొత్త వారిని కలవటం.. జన సమూహాలకు దూరంగా ఉండటం లాంటి జాగ్రత్తలతో కోవిడ్ అర్థమండల దీక్షను పూర్తి చేయటం ద్వారా.. వైరస్ అపాయం నుంచి అంతో ఇంతో తప్పించుకునే వీలుందన్నది మర్చిపోవద్దు.
Tags:    

Similar News