బస్సు జర్నీ చేస్తున్నోళ్లకు గుండెలు జారేలా చేసిన గోదారి కుర్రాడు

Update: 2020-03-21 04:50 GMT
కరోనా వైరస్ ప్రపంచాన్ని కార్చిచ్చులా చుట్టేస్తున్నా..మన దేశంలోని చాలామందికి చీమ కుట్టినట్లుగా కూడా లేదా? అన్న సందేహం కలిగేలా కొన్ని పరిణామాలు బయటకు వస్తున్నాయి. ప్రజల్లో ఏర్పడిన కరోనా అవగాహన పుణ్యమా అని బయటకు వస్తున్న కొన్ని ఉదంతాలు చూస్తుంటే.. గుండెలు జారి పోవటమే కాదు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు వెళుతున్న ప్రైవేటు బస్సులో ఒక యువకుడు ఎక్కాడు. పక్క సీటులో కూర్చున్న వ్యక్తితో పాటు..మరికొందరు ఆ కుర్రాడి చేతి మీద ఉన్న స్టాంపును గుర్తించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్ని స్వీయ క్వారంటైన్ కావాలన్న షరతుతో విడిచి పెడుతూ.. వారి చేతుల మీద ముద్రలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో యువకుడి చేతి మీద ఉన్న ముద్రను గుర్తించిన ప్రయాణికులు ఆ కుర్రాడ్ని ప్రశ్నించారు.

ఊహించని ఈ పరిణామానికి ఆ యువకుడు బిత్తరపోయాడు. దీంతో అలెర్ట్ అయిన తోటి ప్రయాణికులు ఆ యువకుడ్ని బస్సులో నుంచి కిందకు దించేశారు. ఇంతకూ విషయం ఏమంటే.. ఆ యువకుడు దుబాయ్ నుంచి ముంబయి చేరుకున్నాడు. స్వీయ క్వారంటైన్ తీసుకుంటానని మాట ఇచ్చి.. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా ముంబయి నుంచి ఇతర మార్గాల్లో హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ నుంచి తన సొంతూరు వెళ్లేందుకు ప్రైవేటు బస్సు ఎక్కారు. తోటి ప్రయాణికుల కారణంగా అతడ్ని గుర్తించారు. దీంతో.. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అదుపులోకి తీసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు అతడి నుంచి అన్ని వివరాలు సేకరించటంతో పాటు.. వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. క్వారంటైన్ లో ఉంటామని హామీ ఇచ్చే వారు.. తాము అధికారులకు ఇచ్చిన మాటకు తగ్గట్లు..ఆయా ప్రాంతాల్లోనే ఉండిపోవాలే తప్పించి.. ఇలా ప్రయాణాలు చేయకూడదు.
Tags:    

Similar News