అమెరికాలో కరోనా.. దేశంలో ఎన్నారై కుటుంబాల ఆందోళన

Update: 2020-03-27 17:30 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తృతి భారతదేశంలో ఉన్న ఎన్ఆర్ఐల కుటుంబాల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.  అమెరికా నగర వీధుల్లో కరోనా బాగా వ్యాపిస్తుండడంతో సైన్యాన్ని మోహరించినట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పడం ఎన్ఆర్ఐ కుటుంబాల్లో గుబులు రేపింది. ఇక కొన్ని మీడియా చానెల్స్ లో సైతం చైనాను దాటేసిన అమెరికా అంటూ సగం జనాభాకు కరోనా సోకిందని ప్రసారం చేయడంతో ఇక్కడి వారిలో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి.

అమెరికాలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. తెలుగు వారు బోలెడంత మంది అక్కడ మంచి స్థానాల్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి ఎన్నారైల కుటుంబాల నుంచి అమెరికాలో ఉంటున్న ప్రవాసులకు భారీగా ఫోన్ కాల్స్ వెలుతున్నాయట.. వారి బాగోగులు తెలుసుకుంటున్నారట.. మీడియాలో వస్తున్న వార్తలపై ఆరా తీస్తున్నారట.. సైన్యం మోహరింపుపై ఆరాతీస్తున్నారట..

అయితే తాజాగా వారికి అందుతున్న సమాచారం ప్రకారం.. కరోనా వైరస్ ప్రబలిన ప్రాంతాల్లో సైన్యాన్ని దించిన మాట వాస్తవమే. అయితే అది కర్ఫ్యూ కోసం కాదు.. కరోనా బాధితులకు అవసరమైన వైద్య సామగ్రిని అందించడానికి.. కరోనా సోకిన వారిని ఆస్పత్రులకు తరలించడానికి... సహాయ చర్యల కోసం ఏర్పాట్లు చేయడానికి సైన్యాన్ని కొన్ని రాష్ట్రాల్లో మోహరించారని తెలిసింది.

సోషల్ మీడియా, మీడియాలో అమెరికాలో కరోనా మరణ మృదంగం.. వేల మందికి సోకిందన్న వార్తలు ఎలా ఉన్నా ఎన్నాఆర్ఐలు మాత్రం ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నారని సమాచారం. వారంతా ఇంట్లోనే ఉంటున్నారట.. దీంతో దేశంలోని కుటుంబాలు సైతం ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాలో చూపించినంత ప్రభావం అమెరికా లో లేదని తెలుస్తోంది. అయితే అగ్రరాజ్యాన్ని అభాసుపాలు చేసేలా కథనాలు వస్తున్నాయని తెలుస్తోంది.
Tags:    

Similar News