ఏపీలో సున్నా కేసులు.. అయినా మాస్క్ తప్పనిసరి అంటున్న వైద్యులు!

Update: 2022-04-27 02:30 GMT
ఆంధ్ర ప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.రెండేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటితో పాటు మన దేశం లోనూ విస్తరించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను కూడా గజగజ వణికించింది. అయితే కరోనా ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా ఏపీలో ఒక్క కేసు కూడా ఈరోజు నమోదు అవ్వలేదు. ఆ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి అధికారిక బులిటెన్ విడుదల చేసింది.

అంతే కాకుండా ఆదివారం 2.163 మందికి కరోనా పరీక్షలు చేయించగా.. ఒక్కరంటే ఒక్కరికి కూడా పాజిటివ్ గా తేల లేదు. అంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాగే కొవిడ్ కారణంగా ఎవరూ మరణించ లేదని స్పష్టం చేసింది. గతంలో కరోనా బారిన పడిన వారిలో 12 మంది కోలుకున్నట్లు తెలిపింది. సోమవారం వరకు రాష్ట్రంలో 3.35 కోట్ల శాంపిల్స్ ను పరీక్షించినట్లు ఆ బులిటెన్ లో వెల్లడించారు.

అదే సమయంలో ఫోర్త్ వేవ్ భయం నేపథ్యంలో మాస్క్ వాడకాన్ని కొనసాగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కావడం లేదని మాస్క్ ను నిర్లక్ష్యం చేస్తే.. భారీ మూల్యం చేల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది లోని పలు పట్టణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయని... ఏపీ లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అంతే కాకుండా ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా చిన్న పిల్లలకు టీకాలు ఇంకా అందుబాటులోకి రానందున వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప వారిని బయటకు తీసుకెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే బీపీ, షుగర్, మరిన్ని సమస్యలతో బాధపడే వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అస్సలే బయట తిప్పకూడదని చెబుతున్నారు.

ఇలా అన్నింటిని పాటిస్తేనే.. కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఫోర్త్ వేవ్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. అందుకే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా మాస్క్ ధరించండి. అదే మీ పాలిట శ్రీరామ రక్షగా పని చేస్తుంది.
Tags:    

Similar News