ప్రపంచం ఒకలా.. మనం ఇంకోలా!

Update: 2020-04-20 17:30 GMT
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుల్లో ఒకరైన సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కరోనావైరస్ విషయంలో ట్రంప్‌తో పలు అంశాల్లో విభేదించారు. చివరకు షట్ డౌన్ కూడా ముందుగా విధించి ఉండాల్సిందని కుండబద్ధలు కొట్టారు. దీంతో ట్రంప్ మద్దతుదారులు ఆయన్ను తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దాన్ని ట్రంప్ కూడా షేర్ చేయడం తో డాక్టర్ ఫౌసీని తొలగిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ట్రంప్ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఆయన బాధ్యతల్లో ఆయన కొనసాగుతారని చెప్పారు. ఆయన వెన్నంటి నిలిచారు.

ఇక చైనా, బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లోనూ వైద్యరంగానికి చెందినవారే ఈ కరోనాపై పోరును ముందుండి నడిపిస్తున్నారు. వారే అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు. కానీ, ఇండియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక డాక్టరు వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం నిలవడం చూశాం కానీ భారత్‌లో ప్రధాని కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఐఏఎస్‌లు కానీ అలా ఉండడం చూశామా.. లేదు కదా. వైద్యంపై కానీ, అంటువ్యాధుల శాస్త్రంపై కానీ ఏమాత్రం అవగాహన లేని ఐఏఎస్ అధికారులు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.. వాళ్ల అహాన్ని చల్లార్చుకోవడానికి డాక్టర్లను తొలగిస్తున్నారు. మందులు, చికిత్స పద్ధతులను నిర్ణయించే నిపుణుల కమిటీల్లో ఏమాత్రం అవగాహన లేని ఐఏఎస్ అధికారులు ఉంటున్నారు. వారు డాక్టర్లు ఏం చేయాలో నిర్ణయిస్తున్నారు.

కేంద్రంలో కానీ, రాష్ట్రాల్లో కానీ హెల్త్ సెక్రటరీగా ఉండాలంటే కనీసం 20 నుంచి 30 ఏళ్లు డాక్టరుగా పనిచేసి అనుభవం ఉంటే మంచిది. అంతేకానీ, వైద్యం, ఆరోగ్యంపై కొంచెం కూడా నాలెడ్జ్ లేని ఐఏఎస్‌లు ఉండడం వల్ల ఏం లాభం? దేశంలో ఆరోగ్యరంగంలో మౌలిక వసతుల లేమికి ప్రధాన కారణం ఐఏఎస్‌ల నేతృత్వంలో హెల్త్ ఇనిస్టిట్యూసన్లు నడవడమే. నవ భారతానికి మెడిసన్ - ఇంజినీరింగ్ - అగ్రికల్చర్ - రీసెర్చ్ వంటి అన్ని రంగాల్లో స్పెషలిస్ట్ లీడర్లు కావాలే కానీ ఐఏఎస్‌ లు కాదు.



Tags:    

Similar News