మహారాష్ట్రకు ఏమైంది? ఒక్కరోజులో 1233 పాజిటివ్ కేసులా?

Update: 2020-05-07 04:16 GMT
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పుడా రాష్ట్రంలో పరిస్థితి అపాయకర స్థాయిని కూడా దాటేసింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నాటి నుంచి చూస్తే ఏపీలో పన్నెండు వందల కేసులు దాటితే.. తెలంగాణలో పదకొండు వందల కేసులు దాటాయి. ఈ పరిస్థితికి భిన్నంగా మహారాష్ట్రలో నెలకొంది. ఇప్పుడా రాష్ట్రంలో ఒక్క బుధవారమే.. ఏకంగా 1233 పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితి. ఈ సంఖ్య ఒక్కటి చాలు.. మహారాష్ట్ర పరిస్థితి ఎలా ఉందన్న విషయం అర్థం చేసుకోవటానికి.

తాజాగా తెర మీదకు వచ్చిన కొత్త కేసులతో లాక్ డౌన్ సడలింపుల్ని రద్దు చేశారు. చివరకు కూరగాయలు.. పండ్లు.. పాలు.. నిత్యవసర వస్తువుల్ని అమ్మే అన్ని దుకాణాల్ని మూసివేయాలని నిర్ణయించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పారామిలటరీ దళాల్లోనూ కరోనా కేసులు పెరగటం.. ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రస్తుతం 400కు పైగా కేసులు నమోదు కావటం గమనార్హం. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉంది. రాష్ట్ర రాజధాని ముంబయిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలను దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటం విశేషం. మద్యం దుకాణాల్ని తెరవటంతోనే.. అన్ని వదిలేసిన ప్రజలు మద్యం కోసం ఎగబడ్డారు.

దీంతో పరిస్థితి మరింత దిగజారి పోతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపుల్ని రద్దు చేసిన బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ మరోసారి కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించారు. మద్యం దుకాణాలతో పాటు అత్యవసర సేవలు అందించే మెడికల్ షాపుల్ని క్లోజ్ చేయించారు. రికార్డు స్థాయిలో నమోదైన కేసులతో బుధవారం నాటికి మహారాష్ట్ర లో మొత్తం కేసుల సంఖ్య 16758కు పెరిగింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 651 మంది మరణించారు. ఒక్క బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా 34 మంది మరణిస్తే.. అందులో ముంబయికి చెందిన వారే పాతిక మంది కావటం గమనార్హం. మహారాష్ట్ర లో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనాను చూస్తే.. భారీ ఆపరేషన్ చేస్తే తప్పించి.. వైరస్ కు చెక్ చెప్పటం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News