మొన్న 27 - నిన్న 13 - ఇవాళ 7..తెలంగాణ‌లో అదుపులోకి క‌రోనా!

Update: 2020-04-25 17:33 GMT
పై అంకె‌లు చూస్తుంటే తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ అదుపులోకి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇన్నాళ్లు దాదాపు రోజుకు వంద‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు న‌మోదైన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మూడు - నాలుగు రోజులుగా తెలంగాణలో క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గుము ప‌ట్టాయి. ప్ర‌భుత్వం తీసుకుంటున్న క‌ట్ట‌డి చ‌ర్య‌లతో స‌త్ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా శ‌నివారం కేవ‌లం 7 కేసులు న‌మోదు కావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని కొన్ని రెడ్ జోన్ ప్రాంతాల‌ను ఎత్తివేసి అక్క‌డ గ్రీన్‌ జోన్ విధానం అమ‌లు చేసేందుకు నిర్ణ‌యించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా కేసుల్లో వెయ్యి దాట‌గా తెలంగాణ మాత్రం ఇంకా వెయ్యికి చేరువ‌లోనే ఉంది. తెలంగాణలో తాజాగా శ‌నివారం కొత్తగా వెలుగులోకి వ‌చ్చిన 7 పాజిటివ్ కేసుల్లో 6 జీహెచ్‌ ఎంసీ పరిధిలో - ఒక‌టి వరంగల్ జిల్లా అర్బన్‌ లో నమోదైన‌ట్లు మంత్రి ఈట‌ల ప్ర‌క‌టించారు. వీటితో క‌లిపి తెలంగాణ‌లో మొత్తం కరోనా వైరస్ కేసులు 990కి చేరాయి. క‌రోనా బారిన ప‌డి 25 మంది మృతి చెందగా కోలుకున్న వారు 307 మంది ఉన్నారు. వారంతా చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో 658 మంది క‌రోనా వైర‌స్‌ కు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విధంగా కేసులు త‌గ్గుతుండ‌డంతో తెలంగాణ కొంత సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది. ఇదే ప‌ద్ధ‌తిన కొన‌సాగితే తెలంగాణ‌లో కొత్త కేసులు వెలుగులోకి రావ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News