క‌రోనా అప్డేట్‌: దేశంలో 8,447 - తెలంగాణ‌లో 531 - ఏపీలో 420

Update: 2020-04-12 15:01 GMT
భారత‌దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ప‌ది వేల‌కు చేరేందుకు పరుగులు పెడుతున్నాయి. దేశంలో క‌రోనా వైర‌స్ దావానంలా వ్యాపిస్తోంది. ప‌క‌డ్బందీగా లాక్‌ డౌన్ కొన‌సాగుతున్నా వైర‌స్ వ్యాప్తి మాత్రం త‌గ్గ‌డమే లేదు. దేశ‌వ్యాప్తంగా అదే ప‌రిస్థితి ఉంది. తాజాగా ఒక్క‌రోజులోనే కొత్తగా 918 మందికి కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావ‌డంతో దేశంలో క‌రోనా ఇంకా మ‌న‌చేతికి చిక్క‌లేద‌ని తెలుస్తోంది. దాన్ని క‌ట్ట‌డి వేయ‌డంలో మ‌నం విఫ‌ల‌మ‌వుతున్నామ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈరోజు కేసుల‌తో క‌లిపి దేశ‌వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 8,447కి చేరాయి. ఇక 24 గంటల్లో 31 మంది మరణించడంతో మరణాల సంఖ్య 273కి చేరింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి 765 మంది కోలుకుని క్షేమంగా ఇళ్ల‌కు వెళ్లారు.

ఈ క్ర‌మంలో డిశ్చార్జి అయిన వారిని తీసేస్తే ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ గా ఉన్న వైర‌స్ కేసులు 7,409. తాజాగా తమిళనాడు క‌రోనా కేసుల్లో వెయ్యి దాటేసింది. కొత్తగా 106 మందికి కరోనా సోకడంతో తమిళనాడులో మొత్తం కేసులు 1,075కి చేరాయి. ఇప్పటివరకు 11 మంది మరణించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల్లో మ‌హారాష్ట్ర టాప్‌ లో ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,895.

తెలంగాణ‌లో ఆదివారం 28 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఇద్ద‌రు క‌రోనా బారిన ప‌డిన మృతిచెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 530కు చేరాయి. తెలంగాణ‌లో మొత్తం 103మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 412 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. మ‌ర‌ణాల సంఖ్య 16కి చేరింది. అయితే వికారాబాద్ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ 11 మంది కూడా రెండు కుటుంబాలవారే కావడంతో వికారాబాద్ ప‌ట్ట‌ణంలో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఇద్దరు వ్యక్తుల వ‌ల‌న వారి కుటుంబసభ్యులంద‌రికీ క‌రోనా సోకింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనూ క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. మొన్న ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డంతో కంట్రోల్‌ లోకి వ‌చ్చింద‌ని భావించ‌గా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం 15 కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం 420కి క‌రోనా కేసులు చేరాయి. ఈ క‌రోనా కేసుల్లో నంబ‌ర్ వ‌న్ స్థానానికి క‌ర్నూలు - గుంటూరు జిల్లాలు పోటీ ప‌డుతున్నాయి. క‌ర్నూలులో మొత్తం 84 కేసులు న‌మోద‌వ‌గా - గుంటూరులో 82 ఉన్నాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో తీవ్ర ఆంక్ష‌లు విధించారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో లాక్‌ డౌన్ పొడ‌గింపు విష‌య‌మై ఇంకా రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.
Tags:    

Similar News