అక్కడి సీన్ ఎలా ఉందో మాకు వీడియో కాల్ లో చూపించండి

Update: 2020-04-06 04:30 GMT
ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మాయదారి కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. అనుకున్న దాని కంటే కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతోంది. దీంతో.. కొన్ని ప్రాంతాలపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. అలా చేసిన ప్రాంతాల్లో ఒకటిగా హైదరాబాద్ మహానగరాన్ని చెబుతున్నారు. ముందుగా అనుకున్నదానికి భిన్నంగా మర్కజ్ ఎపిసోడ్ తెర మీదకు రావటంతో.. కరోనా పాజిటివ్ కేసులు.. ముందుగా వేసుకున్న అంచనాలు తప్పిన దుస్థితి.

దీనికి తోడు గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్ మహా నగరంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అసలు లాక్ డౌన్ అమలవుతుందా? లేదా? అన్న సందేహం కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖాధికారులకు కలిగింది. దీంతో.. హైదరాబాద్ లోని పరిస్థితిని తమ కళ్లతో చూడాలని డిసైడ్ అయిన అధికారులు వినూత్నమైన ఆదేశాల్ని జారీ చేశారు. భాగ్యనగరి లో తాము చెప్పిన ప్రదేశాలకు వెను వెంటనే వెళ్లాలని చెబుతూ.. కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది.

కేంద్రంలోని అధికారుల ఆదేశాల్ని పాటించిన తెలంగాణ రాష్ట్రంలోని అధికారులు ఉరుకుల పరుగులు పెడుతూ వెళ్లారు. కేంద్ర అధికారులు చెప్పిన ప్రాంతాలకు వెళ్లి.. తమ సెల్ ఫోన్లలో వీడియో కాల్ రూపంలో అక్కడి పరిస్థితిని చూపించారు. దీంతో..లాక్ డౌన్ అమలవుతున్న తీరును కేంద్రంలోని అధికారులు అంచనా వేసినట్లుగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి కసరత్తే చేసిన అధికారులు హైదరాబాద్ మీదా అనుమానాన్ని వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ మీద కేంద్రానికి ఎందుకంత అనుమానం? అన్నదిప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.
Tags:    

Similar News