ముగ్గురు చిన్నారుల్ని చంపేసింది దగ్గుమందే

Update: 2021-12-21 03:13 GMT
షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. నాలుగు నెలల క్రితం దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులు మరణించటం తెలిసిందే. ఈ అనుమానాస్పద మరణాలతో పాటు మరో పదమూడు మంది వరకు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం ఏమిటన్న లెక్క తేల్చేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన షాకింగ్ రిపోర్టును తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం ముగ్గురు చిన్నారుల మరణానికి కారణం దగ్గుమందుగా తేల్చారు.

నాలుగు నెలల క్రితం కళావతి శరణ్ ఆసుపత్రిలో అస్వస్థతో పలువురు చిన్నారులు చేరారు. వీరికి.. డెక్స్ ట్రోమోథార్ఫాన్ దగ్గుమందును ఇచ్చారు. దీన్ని చిన్నపిల్లలకు వినియోగించకూడదని.. ఇది వారి ప్రాణాలకు హాని కలిగించే దగ్గుమందుగా తేల్చారు. పిల్లల మరణాలకు కారణం ఇదేనని స్పష్టమైంది. ఈ దగ్గు మందును ఈ ఆసుపత్రిలోనే కాదు.. ఢిల్లీలోని పలు మొహల్లా క్లినిక్ (హైదరాబాద్ లో బస్తీ దవాఖానాల మాదిరి అన్న మాట) లలో కూడా ఈ దగ్గు మందును పిల్లలకు ఇస్తున్నట్లుగా గుర్తించారు.

తమ పరిశోధనలో ఈ దగ్గు మందు హానికారకమైనదని తేలిందని.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఈ దగ్గు మందును నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆసుపత్రుల డిస్పెన్సరీలతో పాటు మొహల్లా క్లినిక్ లలో ఉన్న ఈ దగ్గుమందును వెంటనే సీజ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఒక సందేహం మాత్రం కొడుతోంది. ఈ దగ్గుమందుకు అనుమతులు ఇచ్చే వేళలో.. దీన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదన్న దానికి సంబంధించి ఏముంది? ఈ ఫార్ములాపై అనుమతులు ఇచ్చిన వారు ఏమని పేర్కొన్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికి లభిస్తాయో?
Tags:    

Similar News