లాహోర్ నుంచి చూసినా కనిపించే మన జెండా

Update: 2017-03-06 05:30 GMT
దాయాది పాకిస్థాన్ లోని లాహోర్ పట్టణం నుంచి చూస్తే.. మన జాతీయపతాకం సగర్వంగా రెపరెపలాడితే ఎలా ఉంటుంది? దుష్ట దాయాదికి మండే మంటను పక్కన పెడితే.. అలా కనిపిస్తుందన్న ఆలోచనే ప్రతి భారతీయుడికి కొత్త కిక్ వచ్చేలా చేస్తుందనటంలో సందేహం లేదు. తాజాగా అలాంటి ఏర్పాటే ఒకటి చేశారు. దేశంలోనే పొడవైనదిగా చెబుతున్న మువ్వెన్నెల జెండా స్తంభాన్ని సరిహద్దుల్లో ఏర్పాటు చేశారు.

భారత్ – పాక్ సరిహద్దుల్లోని అట్టారీ వద్ద ఈ భారీ జెండాను ఏర్పాటు చేశారు. పాక్ సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉండే ఈ ప్రాంతాలో 360 అడుగుల ఎత్తులో జెండా స్తంభం.. 24 మీటర్ల వెడల్ప.. 55 టన్నుల బరువుతో ఏర్పాటు చేసిన ఈ జెండా ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ భారీ జెండాను తాజాగా ఏర్పాటు చేశారు.

ఇందుకోసం దాదాపు రూ.3.5కోట్ల వరకూ ఖర్చుచేసినట్లుగా తెలుస్తోంది. పంజాబ్ ప్రభుత్వానికి చెందిన అమృత్ సర్ ఇంప్రూవ్ మెంట్ ట్రస్ట్ చేపట్టిన ఈ ప్రాజెక్టును తాజాగా ఆవిష్కరించారు. ప్రతి రోజూ సాయంత్రం వేళ జరిగే బీటింగ్ రీట్రీట్ వేళ.. వచ్చే వేలాదిమంది పర్యాటకులకు ఈ జెండా మరింత స్ఫూర్తినిస్తుందని చెప్పటంలో సందేహం లేదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ జెండా పాక్ లోని లాహోర్ పట్టణం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంటుందని చెప్పారు. ఈ జెండాను ఏర్పాటు చేసిన వేళ.. భారతీయులే కాదు.. సరిహద్దు అవతల ఉన్న పాక్  జాతీయులు కూడా ఎంతో ఆసక్తిగా చూసినట్లుగా చెబుతున్నారు. అమృత్ సర్ లో 170 అడుగుల జాతీయజెండా స్తంభం ఉంటే.. తాజాగా అంతకు మించిన అన్నట్లుగా ఏర్పాటు చేసిన 360 అడుగుల ఎత్తున్న జాతీయ జెండా స్తంభం అందరిని ఇట్టే ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News