ముఖ్యమంత్రిపై విచార‌ణ‌కు కోర్టు ఆదేశం.. ఏం జరగ‌నుంది?

Update: 2021-07-04 07:30 GMT
బెంగ‌ళూరు ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప‌కు న్యాయ‌స్థానంలో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. 15 సంవ‌త్స‌రాల నాటి భూముల కేటాయింపు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పింది. ఈ కేసు ద‌ర్యాప్తును ముగించాల‌న్న పిటిష‌న్ ను బెంగ‌ళూరులోని ప్ర‌జాప్ర‌తినిధులు కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా.. ఈ కేసులో వేగంగా విచార‌ణ పూర్తిచేసి, తుది నివేదిక‌ను అందించాల‌ని ఆదేశించింది. దీంతో.. ఇప్ప‌టికే సొంత పార్టీలో అస‌మ్మ‌తిని ఎదుర్కొంటున్న యెడ్డీకి.. ఇప్పుడు మ‌రో ఇబ్బంది వ‌చ్చిప‌డ్డ‌ట్టు అయ్యింది. ఇది ప్ర‌త్య‌ర్థుల‌కు అస్త్రంగా మారే అవ‌కాశం కూడా ఉండ‌డంతో.. క‌న్న‌డ రాజ‌కీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

వ‌ర్తూర్ - వైట్ ఫీల్డ్ ఐటీ కారిడార్ ప‌రిధిలోని బెల్లాండూర్‌, దేవం బీస‌న‌హ‌ళ్లిలోని విలువైన భూముల డీ నొటిఫికేష‌న్ కు సంబంధించి య‌డ్యూర‌ప్ప భారీగా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ విష‌య‌మై వాసుదేవ‌రెడ్డి అనే వ్య‌క్తి.. లోకాయుక్త‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు న‌మోదైన‌ప్పుడు బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ స‌ర్కారులో యడ్యూర‌ప్ప డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

య‌డ్యూర‌ప్పపై వాసుదేవ‌రెడ్డి చేసిన ఫిర్యాదును ప‌రిశీలించిన లోకాయుక్త న్యాయ‌స్థానం.. విచార‌ణ‌కు ఆదేశించింది. అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద య‌డ్యూర‌ప్ప‌పై 2015 ఫిబ్ర‌వ‌రి 21న లోకాయుక్త పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ కేసు ద‌ర్యాప్తును ముగించాల‌ని కోరుతూ.. గ‌తేడాది డిసెంబ‌ర్ లో క‌ర్నాట‌క హైకోర్టును ఆదేశించారు య‌డ్యూర‌ప్ప‌. అయితే.. ఈ పిటిష‌న్ తిర‌స్క‌రించిన కోర్టు.. ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.

తాజాగా.. ఇదే కేసులో ద‌ర్యాప్తును ముగించేందుఉ లోకాయుక్త పోలీసులు దాఖ‌లు చేసిన బీ-రిపోర్టును ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు శ‌నివారం కొట్టేసింది. ఈ కేసులో లోకాయుక్త డిప్యూటీ సూప‌రింటెండెంట్ స్థాయి అధికారితో విచార‌ణ కొన‌సాగించి, తుది నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

దీంతో.. ఈ విష‌యం క‌న్న‌డ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే.. ముఖ్య‌మంత్రిగా ఉన్న య‌డ్యూర‌ప్ప‌పై సొంత ప్ర‌భుత్వంలోనే అస‌మ్మ‌తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని బీజేపీ నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అధిష్టానానికి లేఖ‌ల మీద లేఖ‌లు రాస్తున్నారు. బీజేపీ పెద్ద‌లు కూడా ఈ విష‌య‌మై ఆలోచిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ కోర్టు తీర్పు రావ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. మ‌రి, ఈ ప‌రిణామం య‌డ్యూర‌ప్ప‌ను ఎలాంటి పరిస్థితుల్లోకి నెడుతుందో చూడాలి.
Tags:    

Similar News