ఇంట్లో ఇంకుడు గుంత‌ లేదని.. విచారణకు నో

Update: 2016-10-26 04:58 GMT
ఒక కేసు విచారణ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ తాజాగా చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. నివాస గృహాలన్నింటిలోనూ శాశ్వత ప్రాతిపదికన ఇంకుడు గుంతల ఏర్పాటు.. నీటి పరిరక్షణ నిమిత్తం అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ఈ కేసును విచారిస్తున్న ఏసీజే స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాన్ని తాను విచారించలేనని చెప్పారు. తన ఇంట్లో ఇంకుడుగుంత లేదని.. అలాంటప్పుడు ఈ వ్యాజ్యాన్ని తాను విచారించలేనని చెప్పిన ఆయన.. తాను ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకున్న తర్వాత కేసును విచారిస్తానని చెప్పారు. తనది చిన్న ఇల్లు అని.. తన ఇంట్లో ఇంకుడు గుంతను ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలీదన్న ఆయన.. ఎవరిని సంప్రదించాలో తనకు చెప్పాలంటూ పిటీషనర్.. జీహెచ్ ఎంసీ తరఫు న్యాయవాదుల్ని అడిగారు.

హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ నిబంధనలు.. జీవో 350 ప్రకారం ఇంకుడు గుంతలు ఏర్పాటు కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవటంపై హైదరాబాద్ కు చెందిన వైదేహీ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించే సమయంలో.. ఇంకుడు గుంత లేని విషయాన్ని ప్రస్తావించిన ఏసీజే.. తన ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ కేసును విచారిస్తే సబబుగా ఉంటుందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇవాల్టి రోజుల్లో ఇంత సున్నితంగా ఆలోచించటం అభినందించాల్సిన విషయంగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News