ఏపీ నేతలకు కరోనా వస్తే.. హైదరాబాదే దిక్కా?

Update: 2022-01-12 05:35 GMT
అంతంటారు.. ఇంతంటారు? తమను తప్పు పట్టినోళ్లను ఘాటు వ్యాఖ్యలతోనోళ్లు మూసే ప్రయత్నం చేస్తారు. కాదంటే.. కన్నెర్ర చేస్తారు. ఇదంతా బాగుంటుంది ఎప్పుడు? ఏదో ఒకటి చేసినప్పుడు. అందుకు భిన్నంగా వ్యవహరించే నేతలు తర్వాతి కాలంలో బాధితులుగా మారినప్పుడు సత్యం బోధ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని.

ఘాటు వ్యాఖ్యలతో తరచూ సంచలన వ్యాఖ్యలు చేసే మంత్రి కొడాలి నాని.. గడిచిన రెండు రోజులుగా ఎక్కడా కనిపించటం లేదు. దీంతో..ఆయన మౌనంగా ఎందుకు ఉన్నట్లు? అసలు ఎక్కడ ఉన్నారు? అన్న సందేహం వచ్చిఆరా తీస్తే.. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. సీఎం జగన్ మీద ఈగ వాలినా ఇష్టపడరు.

జగన్ తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడటానికి తెగ ఆరాటపడే కొడాలి నాని.. ఏపీలో జగన్ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాల్ని ఎప్పటికప్పుడు ఏకరువు పెడుతుంటారు. మరి.. అంతలా డెవలప్ అయినప్పుడు.. మంత్రి కొడాలి తనకు పాజిటివ్ అన్నంతనే హైదరాబాద్ కు రావాల్సిన అవసరం ఏముంది? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల గుడివాడలో ఎన్టీఆర్ - వైఎస్సార్ ఎడ్ల పోటీల్ని సంక్రాంతి సందర్భంగా నిర్వహించారు. దీనికి హాజరైనన కొడాలి.. తర్వాత కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీస్తే.. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిర్మాల్ గా ఉందని.. త్వరలోనే డిశ్చార్జి అవుతారని చెబుతున్నారు.

మంత్రి కొడాలి నానితో పాటు విజయవాడకు చెందిన టీడీపీ నేత కమ్ ఫైర్ బ్రాండ్ వంగవీటి రాధా సైతం కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఆయన్ను కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అంతా బాగుంది కానీ.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం  రూపురేఖలు మారినట్లు చెబుతారు. మరి.. అదే నిజమైనప్పుడు.. కరోనా చికిత్స కోసం హైదరాబాద్ కు ఉరుకులు.. పరుగులు పెట్టాల్సిన రావటం దేనికి నిదర్శమో కొడాలి నాని వారు చెబితే బాగుంటుందని చెబుతున్నారు.కరోనా మొదటి.. రెండో వేవ్ వేళ తగిన సమయం లేదని అనుకోవాలి. అలంటప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయి.. రెండు వేవ్ లను చూశాక.. మూడో వేవ్ కన్నా.. భారీ ఆసుపత్రిని ఏపీలో ఎందుకు  ఏర్పాటు చేయనట్లు?
Tags:    

Similar News