చంద్రబాబు మిత్రుడి నోట ప్రధాని హత్య మాట

Update: 2018-09-10 04:14 GMT
ఏడాది కిందట నంద్యాల ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకుని తెలుగుదేశం పార్టీ రచ్చరచ్చ చేసింది. ‘‘ప్రజలను మోసగించిన చంద్రబాబుకు ఉరి శిక్ష వేసినా తక్కువే’’ అంటూ ఆయన ప్రజలను చంద్రబాబు మోసగించిన తీరును ఎండగట్టినప్పుడు టీడీపీ నేతలు ఫిర్యాదులుచేశారు. ముఖ్యమంత్రిని చంపేయాలన్నట్లుగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దానికి విపరీతార్థాలు తీశారు. కానీ... ఇప్పుడు అదే చంద్రబాబు మిత్రుడు... తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏకంగా ప్రధాని మోదీపై అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని నిలబెట్టి 120 సార్లు కాల్చాలన్నారు.
   
పెట్రోల్ ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయిందని విమర్శించారు. ఈ బంద్ లో పాల్గొనని వాళ్లు నిజంగా దేశ ద్రోహులేనని వ్యాఖ్యానించారు. మోదీ అనాలోచితంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా 120 మంది చనిపోయారని నారాయణ అన్నారు. 120 మంది మరణానికి కారకుడైన మోదీని 120 సార్లు నిలబెట్టి కాల్చినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
   
టీఆర్ ఎస్ - బీజేపీ - ఎంఐఎం ఒకే చెట్టుకు ఉన్న కొమ్మలని నారాయణ ఎద్దేవా చేశారు. ఈ పార్టీల వ్యవహారశైలి బయట గుద్దులాట.. లోపల ముద్దులాట తీరుగా ఉందని విమర్శించారు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ - టీడీపీతో జట్టుకడతామని నారాయణ స్పష్టం చేశారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ప్రధానిని కాల్చి చంపడం గురించి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పటికే మోదీ హత్యకు కుట్రలు పన్నిన విషయం బయటపడిదని.. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆలోచనలతో ఉన్న నేతలతో చంద్రబాబు జతకట్టడాన్ని పలువురు నేతలు తప్పు పడుతున్నారు.
Tags:    

Similar News