కేసీఆర్ ను పొగిడేసిన కామ్రేడ్‌

Update: 2018-08-28 08:53 GMT
కామ్రేడ్ నారాయ‌ణ అన్నంత‌నే నోటికి వ‌చ్చిన‌ట్లుగా తిట్టిపోసే సీనియ‌ర్ నేత చ‌ప్పున గుర్తుకు వ‌స్తారు. మొద‌ట్లో కాస్త చూసుకొని మాట్లాడే అల‌వాటున్న ఈ పెద్ద మ‌నిషి.. త‌ర్వాతి కాలంలో ఫ‌స్ట్రేష‌నో మ‌రేమో కానీ నోటికి ఎంత మాట వ‌స్తే అంత మాట అనే ప‌రిస్థితి. గ‌తంలో కామ్రేడ్స్ అన్నంత‌నే విలువ‌లు.. సిద్ధాంతాలు లాంటి చాలా మాట‌లు వినిపించేవి. మీడియాలోనూ వారికి బోలెడంత ప్రాధాన్య‌త ఉండేది.

త‌ర్వాతి కాలంలో వారి మాట‌ల‌కు ప్ర‌చారం త‌గ్గిపోవ‌ట‌మే కాదు.. వారేం మాట్లాడినా ప‌ట్టించుకోని ప‌రిస్థితి. స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితుల్లోనే నారాయ‌ణ నోటి నుంచి తూటాల్లాంటి మాట‌లు వ‌చ్చేవి. దీంతో.. ఆయ‌న మాట‌ల‌కు ప‌త్రిక‌ల్లో స్థానం ద‌క్కేది. ఇష్యూల ప‌రంగా మాత్ర‌మే మాట్లాడే రాఘ‌వులు లాంటి మ‌రో కామ్రేడ్ ప‌రిస్థితి గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఇదిలా ఉంటే.. త‌న నోటి దూకుడుతో ఇప్ప‌టికి మీడియాలో న‌లుగుతున్న నారాయ‌ణ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేర‌ళ రాష్ట్రానికి సాయం అందించ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను మెచ్చుకోవాల‌న్నారు. కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు సీపీఐ నేత‌లు స‌రుకులు.. మందులు..బియ్యం.. బ‌ట్ట‌లు.. విరాళాలు సేక‌రించారు. వీటిని ప్ర‌త్యేక వాహ‌నాల్లో కేర‌ళ‌కు పంపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన నారాయ‌ణ‌.. కేర‌ళ బాధితుల్ని ఆదుకోవ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సాయాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలు త‌ప్పించి మిగిలిన రాష్ట్రాల‌న్నీ కేర‌ళ‌కు సాయాన్ని అందించిన‌ట్లుగా చెప్పారు. యూఏఈ వారి సాయాన్ని అడ్డుకోవ‌టం దారుణంగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేర‌ళ‌కు సాయాన్ని అందించ‌క‌పోవ‌టం స‌రికాద‌న్నారు. ఏమైనా.. కేసీఆర్ ను చాలా కాలం త‌ర్వాత కామ్రేడ్ నారాయ‌ణ పొగిడార‌ని చెప్పాలి.


Tags:    

Similar News