ఐల‌య్య సభ‌పై ఉత్కంఠ‌: అడ్డుకున్నా చేస్తార‌ట‌

Update: 2017-10-27 13:43 GMT
వివాదాస్ప‌ద ర‌చ‌యిత కంచె ఐల‌య్య షెఫ‌ర్డ్ వివాదం మ‌ళ్లీ తెర‌మీద‌కి రావ‌డం, మెలిక‌లు మెలిక‌లుగా తిరుగుతుండ‌డం ప‌రిపాటి అయిపోయింది. ఆర్య వైశ్యుల‌ను కించ ప‌రుస్తూ.. ఆయ‌న రాసిన సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు పుస్తకంపై పెద్ద ఎత్తున దుమారం రేగిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ పుస్త‌కాన్ని విమ‌ర్శించిన వారు ఎంత‌మంది ఉన్నారో.. ఆ పుస్త‌కాన్ని స‌మ‌ర్ధించిన వారూ అంతే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఐల‌య్య‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ ఎస్సీ - ఎస్టీ సంఘాలు స‌హా మ‌రికొంద‌రు సామాజిక వాదులు విజ‌య‌వాడ‌లో స‌న్మానం చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే, ఐల‌య్య‌ను విమ‌ర్శిస్తున్న వైశ్య‌ - బ్రాహ్మ‌ణ సంఘాలు అదేస‌మ‌యంలో ఐల‌య్య‌ను దునుమాడే స‌మావేశానికి రెడీ అయ్యారు.

ఈ రెండూ విజ‌య‌వాడ‌లోనే జరుగుతాయ‌ని ఆయా నేత‌లు ప్ర‌క‌టించారు. అంతేకాదు, ఒకే రోజు కూడా జ‌రుగుతాయ‌ని చెప్పారు. ఇంకా మ‌రో అడుగు ముందుకేసి.. ఒకే స్థలంలో జ‌రుగుతాయ‌ని చెప్పారు. ఈ మేర‌కు అనుమ‌తి కోరుతూ.. విజ‌య‌వాడ  పోలీసుల‌కు రెండు ప‌క్షాలూ ద‌ర‌ఖాస్తు చేశాయి. అయితే, ఇక్క‌డే పోలీసులు అయోమ‌యంలో ప‌డ్డారు. రెండు వ‌ర్గాలు ఒకే రోజు, ఒకే ప్రాంగణంలో స‌భ‌లు -స‌న్మానాలు నిర్వ‌హిస్తే.. కొంప‌మున‌గ‌డం ఖాయ‌మ‌ని భావించారు. దీంతో అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఐల‌య్యకు మ‌ద్ద‌తిస్తున్న వ‌ర్గం మాత్రం పోలీసులు అనుమ‌తి నిరాక‌రించినా స‌న్మానం చేసి తీరుతామ‌ని చెప్ప‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

 ఐలయ్య వర్గానికి చెందిన జేఏసీ నేతలు  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తో క‌లిసి శుక్ర‌వారం నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ను కలిశారు. గాంధీన‌గ‌ర్‌ లోని అతి పెద్ద‌దైన‌ జింఖానా గ్రౌండ్ లో ఐలయ్య సంఘీబావ సభకు రేపు(శనివారం) అనుమతివ్వాలని.. లేకుంటే కందుకూరి ఫంక్షన్ హాలులోనైనా అనుమతినివ్వాలని అభ్యర్ధించారు. సభ కోసం అక్టోబర్ 9 నే కార్పొరేషన్‌ కు చలనా కట్టామని, అనుమతి కూడా వచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు పొలీసులు ర్యాలీకి, సభకు అనుమతి నిరాకరించడం దారుణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అంతేకాదు, తమకు కందుకూరి ఫంక్ష‌న్ హాల్‌ లో అనుమతినిచ్చి ఆర్యవైశ్యులకు మరో ప్రాంతంలో అనుమతినివ్వాలని సూచించారు. అదేస‌మ‌యంలో.. ఒక అడుగు ముందుకు వేసిన సీపీఐ రామ‌కృష్ణ‌.. ఐల‌య్య స‌భ‌కు పోలీసులు అనుమతినిచ్చినా ఇవ్వకున్నా సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక సామాజిక వ‌ర్గానికి తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తోందని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సభ నిర్వహించుకుంటామని, కావాలని కొన్ని సంఘాలు సభను అడ్డుకోవాలని చూస్తే తీవ్రంగా‌ ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News