కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన ప్ర‌ధాని!

Update: 2016-12-31 16:24 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన ప్ర‌సంగంపై విప‌క్షాలు విసుర్లు మొద‌లుపెట్టాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ ఈ విష‌యంపై మిగ‌తా వారికంటే ముందు పెద‌వి విరిశారు. 2O17వ సంవత్సరం రాష్ట్ర ప్రజానీకానికి అన్నివిధాలా అనుకూలించి - ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని - అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తూ రామకృష్ణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్రసంగం ప్రజలకు నిరుత్సాహం మిగిల్చింద‌ని విమర్శించారు. ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.

గత 53 రోజులుగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడ్డారని రామ‌కృష్ణ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్ల నిర్ణయం ఖాళీగా ఉన్న బ్యాంకులు నింపి - బ్యాంకుల ద్వారా కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూర్చేవిధంగా ఉందే తప్ప పేద - సామాన్య ప్రజలకు ఏవిధంగానూ ఉపయోగపడలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బ్లాక్ మ‌నీని అరికట్టి విదేశీ బ్యాంకులలో ఉన్న నల్లధనాన్ని భారత్‌ కు రప్పిస్తానన్న మోడీ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని విమ‌ర్శించారు. ప్రధాని చేసే ప్రసంగాన్ని గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం గుప్పించార‌ని తీరాచూస్తే ఆయన ప్రసంగం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పేదలకు - రైతులకు ఏమీ చేయలేని మోడీ చిన్నచిన్నతాయిలాలు ప్రకటించి చేతులు దులిపారని మండిప‌డ్డారు.

ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పేవిషయాలే తప్పకొత్తగా ప్రధాని తన ప్రసంగంలో చెప్పిందేమీ లేద‌ని పెద‌వి విరిచారు. విదేశాలలో ఉన్న నల్లధనం గురించి మోడీ ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దేశంలో రియల్ ఎస్టేట్ - బంగారం రూపంలో ఉన్న నల్లధనాన్ని ఏ విధంగా అరికడతారో స్పష్టత నివ్వలేదని అన్నారు.  చట్టం తనపని తాను చేసుకుపోతుందంటూ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్న మోడీ విదేశాలలో ఉన్న బ్లాక్ మ‌నీ రప్పించేందుకు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ కేంద్రం తన వైఖరిని ఈ నూతన సంవత్సరంలోనైనా మార్చుకుని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి మేలు జరిగే విధంగా ప్రకటనలు చేయాలని రామ‌కృష్ణ సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News