రోశయ్య జీవితంలో కీలకమైన మూడు.. '4'తోనే లింకు

Update: 2021-12-05 04:17 GMT
పరిచయం చేయాల్సిన అవసరం లేని రాజకీయ దిగ్గజం దిగంతాలకు వెళ్లిపోయింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా.. ఒక్కో రంగానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని వీడిపోయి వెళ్లిపోతున్న వైనం తెలుగు వారిని శోకానికి గురి చేస్తోంది. రాజకీయ విలువలు.. మాటల చాతుర్యం.. పెద్దరికం.. మాటలతో కాల్చి వాత పెట్టే వైనం.. అపారమైన మేధస్సు.. అజాత శత్రువు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇప్పటి రాజకీయ అధినేతల్లోనూ.. రాజకీయ వేత్తల్లోనూ కనిపించని ఎన్నో సుగుణాల పుట్ట కొణిజేటి రోశయ్య. అలాంటి ఆయన శనివారం ఉదయం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటం తెలిసిందే.

ఆయన మరణానికి సంబంధించిన చాలా రేర్ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ మాటకు వస్తే మీడియా కూడా ఈ కీలక అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గతానికి భిన్నంగా మారింది మీడియా. కాలంతో సమానంగా పరుగులు తీయటం.. ఆ వేగంలో సున్నితమైన అంశాల్ని మిస్ కావటం.. నిశితంగా పరిశీలించే శక్తిని కోల్పోవటం లాంటివి ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా కొణిజేటి రోశయ్య మరణాన్ని చూసినప్పుడు దీనికి సంబంధించిన అంశం ఒకటి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

ఆయన పుట్టిన తేదీ.. మరణించిన తేదీ ఒక్కటే కావటం..పెళ్లి డేట్ కూడా ఒకటే కావటం గమనార్హం. ఆయన 1933 జులై 4న పుడితే.. ఆయన మరణం 2021 డిసెంబరు 4న చోటు చేసుకుంది. జీవితంలో కీలకమైన వివాహం కూడా '4'నే జరిగింది.
1950 జూన్ 4న ఆయనకు వివాహమైంది. ఇలా జీవితంలో కీలకమైన మూడు అంశాలు.. పుట్టిన తేదీ.. పెళ్లి రోజు.. మరణించిన తేదీ ఒకటే కావటం.. అది ప్రముఖుల్లో చాలా చాలా అరుదుగా ఉంటుందని చెప్పాలి. ఒక రాజకీయ దిగ్గజానికి సంబంధించిన ఇలాంటి విషయాలు సాధారణంగా అందరి నోట్లో నానుతుంటాయి. కానీ.. రోశయ్య విషయంలో అలాంటిదేమీ చోటు చేసుకోలేదని చెప్పాలి. 88 ఏళ్ల పరిపూర్ణ జీవితంలో 52 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అందరికి సాధ్యమయ్యేది కాదు.

ప్రజాజీవితంలో ప్రజల్లో పెద్దగా ఛరిష్మా లేని నాయకుడు.. ముఖ్యమంత్రి కావటం రోశయ్యకు మాత్రమే చెల్లుతుంది. విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా మారటమే కాదు..తమ పార్టీ అధికారంలో ఉన్న వేళ ముఖ్యమంత్రి ఎవరైనా సరే.. ఆర్థిక మంత్రిగా మాత్రం రోశయ్యను మాత్రమే ఎంపిక చేసుకునేవారు. విలక్షణమైన వ్యక్తిత్వం.. రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే పెద్ద మనిషి తత్త్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రోశయ్య పుట్టిన రోజు.. మరణించిన 'డేట్' ఒకటే కావటం గమనార్హం.
Tags:    

Similar News