కుర్రకారు 'రైజింగ్' కి చెన్నై సీనియర్లు విలవిల!

Update: 2020-10-03 03:45 GMT
ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్‌ 7 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. సన్‌రైజర్స్ కుర్రాళ్ల అద్భుత బ్యాటింగ్.. జడేజా, ధోనీ అద్భుత పోరాటంతో.. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.టాస్ గెలిచిన వార్నర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్ బెయిర్‌స్టో తొలి ఓవర్లోనే డకౌటై  నిరాశపర్చాడు.

డేవిడ్‌ వార్నర్‌(28; 29 బంతుల్లో 3x4), మనీష్‌ పాండే(29; 21 బంతుల్లో 5x4) విలియమ్సన్ వరుసగా ఔట్ అవడం తో  హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో యువ బ్యాట్స్‌మన్‌ ప్రియమ్‌ గార్గ్‌ (51; 26 బంతుల్లో 6x4, 1x4) ఆదుకున్నాడు. అతడు రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేసి  అర్ధశతకం సాధించాడు. అభిషేక్‌ శర్మ(31; 24 బంతుల్లో 4x4, 1x6) పర్వాలేదని పించాడు. దీంతో వార్నర్‌సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమం లో చెన్నై వరుస గా వికెట్లు కోల్పోయింది. షేన్‌ వాట్సన్‌(1), రాయుడు(8), డుప్లెసిస్‌(22), కేదార్‌ జాదవ్‌(3) విఫలమయ్యారు. దీంతో బ్యాటింగ్ భారం జడేజా, ధోనీ పై పడింది. ఓ దశ లో వారి మెరుపులతో చెన్నై లక్ష్యం అందుకుంటుందేమో అనుకున్నా సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయి ధోనీసేన 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది.

జడేజా(50; 35 బంతుల్లో  5x4, 2x6) అర్ధశతకంతో మెరవగా,  ధోనీ(47; 36 బంతుల్లో 4x4, 1x6) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.
చివరి ఓవర్‌ లో 28 పరుగులు చేయాల్సి ఉండగా 20 పరుగులే చేసి ఓటమి మూట గట్టుకుంది.

ధోనీ అరుదైన రికార్డు

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్ తో అరుదైన రికార్డు  సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. హైదరాబాద్‌తో ధోనీకి 194వ  మ్యాచ్‌ కాగా ఇప్పటి దాకా సురేశ్ రైనా 193 మ్యాచ్ లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 192 మ్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్ లో మరిన్ని హైలైట్స్


* టోర్నీలో సన్ రైజర్స్  హైదరాబాద్‌కు ఇది రెండో విజయం.

* వృద్ధుల జట్టుగా పేరు తెచ్చుకున్న చెన్నైకి హైదరాబాద్ కుర్రాళ్ళు ఓటమి రుచి చూపారు. సన్ రైజర్స్ విజయాల్లో యువకులదే కీలక పాత్రగా మారింది.

* సన్‌రైజర్స్ 69 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయినా  కుర్రాళ్లు ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ ఆడిన తీరు ఆకట్టుకుంది.

* జడేజా చాన్నాళ్ల తర్వాత అర్ధ సెంచరీ చేశాడు. 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో బ్యాటింగ్ కు దిగిన  జడేజా చక్కటి బ్యాటింగ్ తో  ఫ్యాన్స్‌ను కట్టి పడేశాడు.

* చెన్నై  చివరి ఓవర్‌లో 28 పరుగులు చేయాల్సి ఉండగా ధోనీ ధాటిగా ఆడుతుండటంతో   మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆ ఓవర్ లో చెన్నై 20 పరుగులే చేయగలిగింది.
Tags:    

Similar News