హత్య చేసి మరొకరిని ఇరికించాలని.. చూసి తనే ఇరుక్కుని

Update: 2020-08-05 00:30 GMT
ప్రియుడి అడ్డు తప్పించి, నింద భర్తపై వేసి చీటి డబ్బును నొక్కేయాలని చూసిన కిలాడీ లేడీ ఆట కట్టించారు ఖాకీలు. హత్య చేసి తెలివిగా భర్తకు సంబంధించిన ఆధారాలను పడేసి వెళ్లగా, ఆ క్లూ తోనే పోలీసులు విచారణ సాగించి విజయం సాధించారు. థ్రిల్లర్ లా సాగిన పిడుగురాళ్ల పురుగుల మందు వ్యాపారి హత్య కేసులో నిందితురాలిని చాకచక్యంగా పట్టేశారు.  గుత్తికి చెందిన మహిళ సమీపంలోని పిడుగురాళ్లకు చెందిన పురుగుల మందుల వ్యాపారి  పూర్ణచంద్ర రావుతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తని వదిలేసింది.

ఆ తర్వాత అతడు మరో  పెళ్లి చేసుకున్నా వదల్లేదు. ఆ తర్వాత ఈమె కూడా చీటీలు నడిపే మరో వ్యక్తిని పెళ్ళాడినా  అక్రమ సంబంధాన్ని మాత్రం  కొనసాగించింది. తరచూ పిడుగురాళ్లకు వెళ్తుండటం, ఆమె వ్యహారశైలిలో మార్పు  కనిపించడంతో భర్తకు అనుమానం వచ్చింది. ఆమెపై నిఘా పెట్టగా పిడుగురాళ్లకు చెందిన వ్యాపారితో అక్రమ సంబంధం నెరుపుతున్నట్లు తెలుసుకున్నాడు. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ కిలాడీ లేడి మాత్రం ప్రియుడి అడ్డు తొలగించుకుని ఆ నేరం మొగుడిపై వేసి తను ఎంచక్కా చీటీ డబ్బులతో ఉడాయించాలని పన్నాగం పన్నింది.  పూర్ణచంద్ర రావును ఎప్పటిలాగే ఇంటికి రప్పించి రౌడీ షీటర్ రాజేష్ తో హత్య చేయించింది.

 తన భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులకు తెలిసేలా మృతదేహాన్ని కట్టిన గోనెసంచిలో అతడి ఆధార్, ఓటర్ కార్డు పడేసింది. తన భర్త ను ఇరికించడానికి ఆ మహిళ చేసిన పనే ఆమె పోలీసులకు చిక్కేలా చేసింది. గోనె సంచిలో దొరికిన ఆ ధ్రువపత్రాలే ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ కొనసాగించారు. హత్యకు పాల్పడ్డ వారెవరూ తమ ఆధారాలు తెలిసేలా చేయరు. ఎవరో కేసును పక్కదోవ పట్టించేందుకే ఈ పన్నాగం పన్నారని భావించి అసలు దోషి అయిన ఆ మహిళను పట్టేశారు. ముగ్గురు మగాళ్ల జీవితాలతో ఆడుకున్న మహిళ చివరికి కటకటాల పాలైంది.
Tags:    

Similar News