కొత్త మోసం: ఓటీపీ రాకుండానే డబ్బు కొట్టేస్తున్నారు

Update: 2020-02-21 11:15 GMT
నగదు బదిలీ లో అన్నిటి కంటే సెక్యూరిటీ మన ఫోన్ నంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే మన ఖాతా నుంచి డబ్బులు వేరొకరికి బదిలీ అవుతాయి. ఇది అత్యంత రక్షణాత్మక వ్యవస్థగా ఇన్నాళ్లు బ్యాంక్ వినియోగదారులు, బ్యాంకులు నమ్ముతున్నాయి.

అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు సైబర్ నేరగాళ్లు కూడా డబ్బులను కొట్టేసేందుకు నయా ప్లాన్లు అవలంభిస్తున్నారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంటున్న సైబర్ నేరగాళ్లు పదిహేను రోజుల వ్యవధిలో హైదరాబాదీల నుంచి రూ.85 లక్షల బదిలీ చేసుకోవడం కలకలం రేపింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఓటీపీ చెప్పకపోయినా తమ ఖాతాల్లోంచి నగదు మాయం అయ్యిందని బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నేరాలు పోలీసులను సైతం విస్మయ పరిచాయి.

ఇన్ఫోసిస్ సంస్థలో టెక్నాలజీ అనలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఒక టెకీ యువతికి ఫోన్ చేసి పీటీఏం వివరాలు తీసుకోండి అంటూ నమ్మించి 1.22 లక్షలు స్వాహా చేశారంటే సైబర్ మోసగాళ్లు ఎంత తెలివిమీరి పోయారో అర్థం చేసుకోవచ్చు. కశ్మీర్ నివాసి అయిన రషీద్ ను పేటీఎంతోనే మోసం చేసి రూ.1.48లక్షల నగదును కాజేశారు.

దీనిపై ఆరా తీసిన సైబర్ పోలీసులకు కొత్త తరహా మోసం కనుగొన్నారు. ఈ-వ్యాలెట్ ల ద్వారా ఓటీపీ అవసరం లేకుండా డబ్బులు మోసగాళ్లు కాజేస్తున్నట్టు కనిపెట్టారు. మొబైల్ యాప్ లలోని ఈ వ్యాలెట్ లలో ఓటీపీ అవసరం లేకుండా రూ.10వేల వరకు ఈజీగా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ను పసిగట్టిన సైబర్ నేరగాళ్లు బాధితుల ఖాతాల్లోంచి ఫేక్ గా సృష్టించిన తమ తమ ఈ వ్యాలెట్లలోకి రూ.5వేలు, రూ.10వేల చొప్పున నగదు బదిలీ చేసుకుంటున్నారు. తక్కువ మొత్తం కావడం తో ఓటీపీ అవసరం లేకుండానే క్షణాల్లో బాధితుల నగదు వ్యాలెట్ లోకి వెళ్లిపోతోంది. వ్యాలెట్ లోంచి రెండు మూడు రోజుల తర్వాత తమ తమ ఖాతాల్లోకి మార్చుకుంటూ లక్షల మోసం చేస్తున్నారు.


Tags:    

Similar News