క‌మ‌ల్‌ కు వ‌న్ ఇయ‌ర్ టైమిచ్చాడు

Update: 2017-07-31 05:21 GMT
అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు అన్నిఇన్ని కావు. ఓప‌క్క త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు.. మ‌రో సినీ న‌టుడు.. లోక నాయ‌కుడిగా పేరున్న విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కాలంలో అధికార‌ప‌క్షంపై క‌మ‌ల్ హాస‌న్ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అవినీతి.. అక్ర‌మాల‌పై త‌రచూ త‌న గ‌ళం విప్పుతున్న ఆయ‌న‌.. మంత్రుల‌ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

క‌మ‌ల్ తీరుపై అధికార‌ప‌క్ష మంత్రులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. త‌మ‌ను టార్గెట్ చేస్తున్న క‌మ‌ల్ పై ఎవ‌రికి వారు త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు. తాజాగా ఆజాబితాలో త‌మిళ‌నాడు ఆర్థిక‌మంత్రి జ‌య‌కుమార్ చేరారు. క‌మ‌ల్ హాస‌న్ పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఏనాడైనా ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించారా? ముల్లై పెరియార్‌.. కావేరి లాంటి ఇష్యూల మీద గ‌ళం విప్పారా? అంటూ సూటిగా ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఏడాది వ్య‌వ‌ధి ఇస్తున్నాన‌ని.. ఆ లోపు రాజ‌కీయాల్లో రా.. అంటూ పిలుపునిచ్చారు. ఇంత‌కాలం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద మౌనంగా ఉండి.. ఇప్పుడేదో ఉద్ద‌రించ‌టానికి బ‌య‌లుదేరిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాదన్నారు.

త‌మిళ ప్ర‌జ‌లు అమితంగా ఆరాధించే ఎంజీఆర్‌.. జ‌య‌ల‌లిత‌లు నేరుగా రాజ‌కీయాల్లోకి రాలేద‌ని.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యార‌ని.. స‌మ‌స్య‌ల‌పై వారెన్నో పోరాటాలు సాగించార‌న్నారు. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి రాణించిన విష‌యాన్ని క‌మ‌ల్ గుర్తు ఉంచుకుంటే మంచిద‌ని.. అంతేకానీ అన‌వ‌స‌రంగా నోరు జార‌టం మంచిప‌ద్ధ‌తి కాద‌న్నారు. రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటే ఏడాది చివ‌రి నాటి వ‌ర‌కూ గ‌డువు ఇస్తున్న‌ట్లుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఎవ‌రైనా ఒక వ్య‌క్తి.. నేను మంచివాడిని.. నా మీద కేసులు లేవు.. నా జీవితం నిజాయితీతో కూడుకున్న‌ద‌ని ఎవ‌రైనా వ్యాఖ్య‌లు చేస్తే.. వారిని నాయ‌కుడిగా అంగీక‌రిస్తాన‌ని క‌మ‌ల్ అన్నార‌ని.. అలాంటి నేత‌లు చాలామందే ఉన్నార‌న్నారు. అధికార‌ప‌క్షంపై క‌మ‌ల్‌.. లోక నాయ‌కుడి మీద అధికార‌ప‌క్ష నేత‌ల మాట‌ల దాడి ఎంత‌వ‌ర‌కూ వెళుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News