బీసీల దేవుడు ఆయనే...చిన్నమ్మ మాట అది

Update: 2022-12-07 15:37 GMT
బీసీలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చినది దివగంత నేత ఎన్టీయార్ ర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆయన రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా వారికి అన్ని విధాలుగా అవకాశాలు కల్పించారని ఆమె గుర్తు చేశారు.

బీసీలకు ఒక గుర్తింపు తీసుకు వచ్చింది ఎన్టీయార్  అని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీయార్ సరిసాటి నేత బీసీలకు మేలు చేసిన వారు వేరొకరు లేనేలేరని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండవ మాట లేదని అన్నారు. ఎన్టీయార్  తరువాత ఎవరూ ఆ స్థాయిలో బీసీలకు మేలు చేయలేదని ఆమె చెప్పడం విశేషం.

ఇదిలా ఉంటే  బీసీల పేరిట సభలు జరపడం కాదంటూ వైసీపీ మీద ఆమె మండిపడ్డారు. మీకు సత్తా ఉంటే మూడున్నరేళ్ళుగా ఏపీలో బీసీలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు సంక్షేమం అభివృద్ధి ఏమి చేశారో అన్నీ కూడా బయటపెట్టాలని ఆమె కోరారు.

బీసీల విషయంలో బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీయార్  అని పురంధేశ్వరి చెప్పడం ద్వారా వైసీఎపీ గాలి తీసేశారు. జయహో బీసీ అంటూ సభ పెట్టి బీసీలను ఉద్ధరిస్తోంది తామే అని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్న వైసీపీకి ఎన్టీయార్  తనయ ఆ విధంగా గట్టి షాక్ ఇచ్చేశారు.

నిజానికి ఈ మాట చెప్పాల్సింది టీడీపీ. అయితే ఆ పార్టీ బీసీలకు మేలు చేసింది మా బాబు అని చెప్పుకుంటోంది.  బీసీలకు కేరాఫ్ టీడీపీ అని ప్రచారం చేసుకుంటోంది. దాంతో బీజేపీలో ఉన్న చిన్నమ్మ ఎన్టీయార్  పేరుని తీసుకువచ్చారు. ఆయన బీసీల బాంధవుడు అంటూ కీర్తించారు. ఆమె చెప్పినది నిజమే కానీ ఎన్టీయార్  బీసీలకు మేలు చేశారు అంటే అది కచ్చితంగా టీడీపీకే ఓటు బ్యాంక్ గా మారుతుంది తప్ప బీజేపీకి ఏమీ ఒరగదు అన్న సంగతిని మరచారు అంటున్నారు.

బీసీలకు బీజేపీ ఏం చేసిందో కూడా ఆమె చెబితే బాగుండేది అని అంటున్నారు. అదే సమయంలో బీసీలకు తమ పార్టీ పెద్ద పీట వేస్తుందని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అని అంటున్నారు. వైసీపీ వారు ఎక్కువ చేశారో తక్కువ చేశారో తమ గురించి తాము చెప్పుకున్నారు. అలాంటిది బీజేపీది ఏదైనా ఉంటే చెప్పాలి. లేదా చేస్తామని హామీ ఇవ్వాలి. మధ్యలో ఎన్టీయార్ ని తెస్తే అన్న గారి మీద పూర్తి పేటెంట్ హక్కులు టీడీపీకే ఉన్న వేళ ఆ క్రెడిట్ ఆ పార్టీకే పోతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ చిన్నమ్మ మాటలు టీడీపీకే హెల్ప్ చేసేలా ఉన్నాయని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News